గుంటూరు : అత్యున్నత ప్రమాణాలే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా
రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందని తద్వారా అద్బుత ప్రగతి సాధించి
దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా శనివారం ఈ
అంశానికి సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. విద్యా కానుక కింద
విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ, ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టి బై లింగ్యువల్
పుస్తకాలు అందించడం, అన్ని తరగతులలోనూ డిజిటల్ విధానంలో విద్యాభోధన, జగనన్న
గోరుముద్దలు కింద పౌష్టికాహారం పంపిణీ, నాడు-నేడు తో పాఠశాలల్లో అన్ని రకాల
మౌలిక సదుపాయాలు కల్పించడం, అమ్మ ఒడితో అందరికీ చదువుకునే అవకాశం కల్పించడం,
అత్యధిక మార్కులు సాధించిన వారికి నగదు పురస్కారం వంటివి చేపట్టి విద్యా
రంగంలో సమూల మార్పులు తెచ్చారని అన్నారు.
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారుధులు వాలంటీర్లు
వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులని, ప్రభుత్వ పథకాలు, సేవలు
ప్రజలకు అందించడంలో వాలంటీర్ల పాత్ర ఎనలేనిదని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ
సందర్భంగా వాలంటీర్లే తన సైన్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనియాడిన
సందర్భాన్ని గుర్తు చేశారు.
రూ. 2000 నోటు రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
రూ.2000 నోటు చలామణి రద్దుచేస్తూ రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని
స్వాగతిస్తున్నానని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ పెద్ద నోటు దాచుకోవడానికి తప్ప
దీని వల్ల పెద్దగా ప్రయోజనమేమీ లేదని అన్నారు. రూ.2000 నోటు రద్దుతో రూ.500
నోటు పెద్ద నోటుగా ఉంటుందని ఇది శుభపరిణామని అన్నారు