రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
మహాత్మా గాంధీ జీవిత చరిత్రపై రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన
వినోద్ కుమార్, డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి
హైదరాబాద్ : జాతిపిత, మహాత్మా గాంధీ ఆలోచన విధానం అనుసరణీయం అని రాష్ట్ర
ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం
మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్ హౌస్ లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్
ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో మహాత్మా గాంధీ జీవిత చరిత్రపై రూపొందించిన
ప్రత్యేక సంచికను వినోద్ కుమార్, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ డాక్టర్
గున్న రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్
మాట్లాడుతూ మతసామరస్యం, శాంతి, సౌబ్రాతృత్వం ప్రతి మనిషి జీవన విధానం కావాలని
పేర్కొన్నారు. మతోన్మాద శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని వినోద్ కుమార్
పిలుపునిచ్చారు. మత విశ్వాసం వ్యక్తిగతం అని, మత ఉన్మాదం ప్రమాదకరమని అన్నారు.
మత సామరస్యం జాతిని ఒక్క తాటిపై నడిపిస్తుందని వినోద్ కుమార్ అన్నారు. అహింసా
మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చిన మహాత్మా గాంధీని సామాజిక
మాధ్యమాల్లో కొన్ని రాజకీయ శక్తులు అవమానిస్తున్నాయని, ఇది మంచి సంప్రదాయం
కాదని వినోద్ కుమార్ అన్నారు. మత విద్వేషాలను ప్రేరేపించే విధానాలు దేశ
సార్వభౌమత్వానికి ప్రమాదకరం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ
ఆలోచన విధానంపై రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చర్చ
పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని, ఆ బాధ్యతలు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్
డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి తీసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. విద్యా,
వైద్యం, వ్యవసాయం, పర్యావరణ అంశాలపై గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్
ట్రస్ట్ సంస్థలు చేస్తున్న కృషిని వినోద్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో
గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి,
రాష్ట్ర ప్రతినిధులు కలీం ఖాన్, ఎం వీ గోనా రెడ్డి, విజయ్ కుమార్, వాణి,
సురేష్ గుప్తా, గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.