కేంద్రంలో మోడీ సర్కార్ అధికారం చేపట్టి 9ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జన్
సంపర్క్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ క్రమంలో
రాష్ట్ర పార్టీ ఈ జన్ సంపర్క్ను వేదికగా చేసుకుని విస్తృతంగా జనంలోకి
వెళ్లాలని నిర్ణయించింది.
హైదరాబాద్ : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులకు
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తీవ్ర సంకట స్థితిని తెచ్చిపెట్టాయి. ఈ ఫలితాలతో
బీజేపీలోకి చేరికలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలు చేజారిపోకుండా
ఉండేలా రాష్ట్ర పార్టీ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. కర్ణాటక ఫలితాల
ప్రభావం నుంచి పార్టీ శ్రేణుల దృష్టి మరల్చేందుకు.. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల
పాలనను అస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించింది. జన్సంపర్క్ అభియాన్ పేరుతో
దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ అధిష్ఠానం ఆదేశించింది.
ఇందులో భాగంగా తెలంగాణలో జన్సంపర్క్ను అభియాన్ను మరింత క్రీయశీలకంగా
నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. తద్వారా పార్టీ శ్రేణుల్లో
ఉత్తేజం నింపడంతో పాటు పార్టీని బలోపేతం చేసుకోవచ్చని అంచనావేసింది. ఈనెల 30
నుంచి జూన్ 30వ వరకు నెల రోజుల పాటు కార్యక్రమాలను రూపొందించుకుంది. అన్ని
జిల్లాలు, మండలాలు, శక్తి కేంద్రాలు, బూత్లు, అన్ని లోక్ సభ నియోజక వర్గాల్లో
ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 51
భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంటే తెలంగాణలోనే 2 సభలు నిర్వహించనుంది.
“దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అన్ని
స్థాయిల్లోనూ ఈ సమావేశాలు జరుగుతాయి. వీటి ముఖ్య ఉద్దేశం జనంలోకి వెళ్లడమే.
23, 24 రోజుల్లో జిల్లా స్థాయిలో సమావేశాలు, 25, 26తేదీల్లో మండల స్థాయి
సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాం. ఈ నెల 30న ప్రధాని మోదీ ర్యాలీ
నిర్వహించి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని బీజేపీ
సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణ తెలిపారు.