బెంగుళూరు : కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా
జరిగింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్
ప్రమాణస్వీకారం చేశారు. ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు విపక్ష పార్టీల నేతలు సైతం
హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ
స్వీకారం చేశారు. ఏకైక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు.
వీరితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సైతం మంత్రులుగా ప్రమాణం స్వీకారం
చేశారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం
అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాక్టర్ జి పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కెజె జార్జ్,
ఎంబి పాటిల్, సతీష్ జార్కిహోళి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రియాంక్
ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ సైతం రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ
స్వీకారం చేశారు. కార్యక్రమం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. కర్ణాటకలో
స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రజలకు అయన హామీ ఇచ్చారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తరువాత పార్టీ విక్టరీపై చాలా కథనాలు, విశ్లేషణలు
వచ్చాయి. కానీ కాంగ్రెస్ పేదలు, దళితలు, ఆదివాసిలు, వెనుకబడిన వర్గాల పైపు
నిలబడినందుకే పార్టీ గెలిచిందని నేను చెప్పాలనుకుంటున్నాను. కాంగ్రెస్
పార్టీకి పేద ప్రజలు అండగా ఉన్నారు. కాంగ్రెస్ పక్షాన నిజం ఉంది. బీజేపీకి
డబ్బు ఉంది. పోలీసులూ అండగా ఉన్నారు. అయినా ప్రజలు బీజేపీని ఓడించారని రాహుల్
చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఐదు వాగ్దానాలు చేసిందని.. అవి కర్ణాటక
ప్రభుత్వ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టంగా మారుతాయని రాహుల్ గాంధీ
ప్రకటించారు.
మే 10న విడుదలైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 224 స్థానాలకు గాను
కాంగ్రెస్ 136 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 66 స్థానాలు గెలుచుకుంది.
జేడీఎస్ 19 స్థానాలకు పరిమితమైంది.