ఎజెండాలో ఉక్రెయిన్, చైనా, ఏఐ
ప్రత్యేక అతిథిగా పాల్గొననున్న నరేంద్ర మోడీ
జపాన్ : మానవాళి చూసిన మొదటి అణు మారణహోమ క్షేత్రం హిరోషిమా! రెండో ప్రపంచ
యుద్ధంలో అమెరికా ఆగ్రహానికి గురవడంతో అణు దాడి కారణంగా జపాన్‌లోని ఈ పట్టణంలో
నాడు వేలమంది ప్రాణాలు కోల్పోయారు. దాని తాలూకు దుష్ప్రభావాలతో ఇప్పటికీ అక్కడ
అనారోగ్యంతో అనేక మంది జీవితాలు బలవుతున్నాయి. ఈ పట్టణం వేదికగా జీ-7 దేశాల
శిఖరాగ్ర సదస్సు శుక్రవారం ఆరంభం కాబోతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ
సదస్సులో అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా దేశాల
అధినేతలు పాల్గొంటారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా దూకుడు, మానవాళికి
కృత్రిమ మేధ సవాళ్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక
సంక్షోభం కూడా ప్రస్తావనకు రావొచ్చు.
అణు సంయమనానికి పిలుపు : జపాన్ ప్రధాని కిషిద సొంతూరు హిరోషిమానే! ప్రస్తుత
ఘర్షణాత్మక వాతావరణంలో అణ్వస్త్రాల విషయంలో అన్ని దేశాలూ స్వీయనియంత్రణతో,
సంయమనంతో వ్యవహరించాలని ఆయన జీ-7 వేదికగా నొక్కిచెప్పబోతున్నారు. అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇప్పటికే జపాన్
చేరుకున్నారు. జపాన్‌తో సునాక్ పలు వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
క్వాడ్ కూడా ఇక్కడే : భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేసియా, దక్షిణ
కొరియా, వియత్నాంలాంటి మరికొన్ని దేశాల అధినేతలు జీ-7 సదస్సుకు ప్రత్యేక
ఆహ్వానితులుగా వస్తున్నారు. భారత్ తరఫున ప్రధాని మోదీ హాజరవుతున్నారు.
ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఇంధన సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ
బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థల నాయకులూ సదస్సులో
పాల్గొంటారు. ఆస్ట్రేలియాలో రద్దయిన క్వాడ్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా,
జపాన్) సదస్సును జీ-7 సమావేశాల సందర్భంగా జపాన్‌లోనే
నిర్వహించాలనుకుంటున్నారు.
యుద్ధంపై ఏమంటారో : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు వాణిజ్యపరంగా, తైవాన్
విషయంలో చైనా దూకుడును కట్టడి చేయటంపై, కృత్రిమ మేధతో తలెత్తే ముప్పులపై జీ-7
సదస్సులో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. రష్యాపై ఆంక్షలను మరింత పెంచాలని
అమెరికా కోరుకుంటోంది. యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా సారథ్యంలోని నాటో
దేశాలన్నీ ఆర్థికంగా, ఆయుధపరంగా సాయం అందిస్తున్నా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలు
మనఃస్ఫూర్తిగా సహకరించటం లేదనే అనుమానాలున్నాయి. యుద్ధ విరమణ దిశగా ఈ
సమావేశంలో ఏమైనా చర్చిస్తే అది సంచలనమే అవుతుంది.
చైనాపై ఏకాభిప్రాయం కుదిరేనా? : అనేక దేశాల్లో చైనా ఆర్థిక దూకుడును,
పెత్తనాన్ని తగ్గించాలని అమెరికా భావిస్తోంది. చైనాతో పోరులో తైవాన్‌కు అండగా
నిలవాలనుకుంటోంది కూడా. జీ-7 దేశాలది పైకి ఒకే భావజాలంలా కనిపిస్తున్నా చైనా
విషయంలో విభేదాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ ఈ విషయాన్ని
బహిరంగంగానే వ్యక్తం చేస్తోంది. తైవాన్-చైనా గొడవలతో తమకు సంబంధం లేదని
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇటీవలే ప్రకటించారు. అమెరికా ఎలా చెబితే అలా
నడుచుకోవటానికి తాము వారి బానిసలమేమీ కాదనీ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి
అతిథులుగా వస్తున్న బ్రెజిల్, భారత్, ఇండోనేసియాలు కూడా రష్యాపై ఆంక్షల
విషయంలో నాటోతో కలసి రావటం లేదు. కాబట్టి రష్యా-ఉక్రెయిన్, చైనాలపై
ఏకాభిప్రాయం అంత సులభం కాకపోవచ్చు. కృత్రిమ మేధ నష్టాల విషయంలో మాత్రం అన్ని
దేశాలూ ముక్తకంఠంతో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
జీ5.. జీ8.. జీ7 : ప్రముఖ పారిశ్రామిక, పెట్టుబడిదారీ అగ్రదేశాల కూటమే ఈ జీ-7!
ఇందులో అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్
ఇందులో సభ్యదేశాలు. ప్రపంచ జీడీపీలో వీటి వాటా దాదాపు 50 శాతం. ఇవి 1973లో
చమురు సంక్షోభం సమయంలో కూటమిగా ఏర్పడ్డాయి. ఏటా ఓ దేశం అధ్యక్షతన శిఖరాగ్ర
సమావేశం నిర్వహిస్తుంటారు. తొలి సమావేశం (1973) ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో
అమెరికా శ్వేతసౌధంలోని లైబ్రరీలో లాంఛనంగా జరిగింది. తొలుత ఇందులో ఐదు దేశాలే
ఉండేవి. తర్వాత ఇటలీని చేర్చుకొని జీ-6గా మారారు. ఆ తర్వాత కెనడా చేరికతో
జీ-7గా, 1998లో రష్యాతో కలసి జీ-8గా మారింది. 2014లో క్రిమియాను
ఆక్రమించుకుందనే కారణంతో రష్యాను కూటమి నుంచి బహిష్కరించారు. దీంతో కూటమి
జీ-7గా మిగిలింది. ఐరోపా యూనియన్‌కు ఇందులో శాశ్వత అతిథి హోదా కల్పించారు.