ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు
వెలగపూడి సచివాలయం : తెలుగును అధికార భాషగా, పాలనా భాషగా అమలు పర్చేందుకు తమ
ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు
అధికార భాషా సంఘం అద్యక్షులు పి.విజయబాబు తెలిపారు. ఈ విషయంలో ఎటు వంటి అవగాహన
లేకుండా రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులతో పాటు పలువురు ఈ నెల 14 న
విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పలు విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు
పలికారు. బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో మాజీ మంత్రి,
శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్య వర ప్రసాద్ తో కలసి ఆయన పాత్రికేయులతో
మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనా భాషగా తెలుగును అమలు పర్చేందుకు తెలుగు అధికార
భాషా సంఘం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మే 14 ఆదివారం అధికార భాషా
దినోత్సవం రావడం వల్ల అంతకు ముందు నుండే గోదావరి జిల్లాల్లో పర్యటించి సమీక్షా
సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహించడం జరిగిందన్నారు. అధికారులు, ఉద్యోగులు
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారని, సంబందిత వార్తాంశాలు కూడా పలు
మాధ్యమాల్లో ప్రచురితమయినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా తిరుపతితో పాటు పలు
జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించడం కూడా జరిగిందని తెలిపారు. మాజీ
ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్.టి.రామారావు హయాంలో అధికార భాషగా తెలుగును
చాలా చక్కగా అమలు చేయడం జరిగిందని, అయితే గత ప్రభుత్వ హయాంలో కనీసం అధికార
భాషా సంఘాన్ని కూడా నియమించలేదనే విషయం పై వీరు ఏమాత్రం మాట్లాడకపోవడం
శోచనీయమైన విషయమన్నారు. పూర్తిగా నిద్రాణ స్థితిలోనున్న అధికార భాషా సంఘాన్ని
పునరుద్దరించిన ఘనత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. తెలుగు
ను పాలనా భాషగా చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం అమలు చేస్తుంటే వాటిని ఏమాత్రం
గుర్తించకుండా తెలుగునే పాలనా భాషగా అమలు పర్చాలని డిమాండు చేయడం విచిత్రంగా
ఉందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల పీచమణచి పలు వినూత్న కార్యక్రమాలను ఈ
ప్రభుత్వం అమలు పరుస్తుంటే అందుకు విరుద్దంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈ
ప్రభుత్వం లొంగిపోయిందని విమర్శించడం సరికాదన్నారు. పేద విద్యార్థుల
ఆత్మస్థైర్యం పెంపొందేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలు పర్చడం
మరియు పరిపాలనా వ్యవస్థలో పాలనా భాషగా తెలుగు అమలు పర్చడం మద్య ఎటు వంటి
పొంతన, పోలిక లేదన్నారు. పేద పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువుతున్నందున, తెలుగు
భాష భ్రష్టుపట్టి పోతుందనం సరికాదన్నారు. తెలుగు పాలనా భాషగా చక్కగా అమలు
పర్చడం జరుగుతుందని, క్రమంగా అమలు శాతం పెరుగుతున్నదనే విషయాన్ని
గుర్తించాలన్నారు. తాను తెలుగు భాషా సంఘం అద్యక్షులుగా బాధ్యతలు చేపట్టినప్పటి
నుండి రాష్ట్రంలో తెలుగు ను పాలనా భాషగా అమలు పర్చేందుకు పెద్ద ఎత్తున
కృషిచేయడం జరుగుచున్నదన్నారు. అయితే భాషను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడం
సరికాదన్నారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి మరియు శాసన
మండలి సభ్యులు డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష వారసత్వాన్ని,
ఔన్నత్యాన్ని కాపాడేందుకు జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని, అయితే ఈ
విషయాన్ని గుర్తించకుండా పలువురు ఆరోపణలు చేయడం ఎంతో శోచనీయమన్నారు. రాజకీయ
విమర్శలు చేయకుండా తెలుగు భాష గొప్పదన్నాన్ని భవిష్యత్ తరాల వారికి
అందజేసేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం ఎంతో గౌరవంగా ఉంటుందని, రాజకీయ
విమర్శలకు వెళ్లవద్దని వారికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పాలనా భాషగా
తెలుగు అమలుకు సంబందించి 2021 మరియు 2022 సంవత్సరాల నివేదికలను కోర్టుకు
కూడా సమర్పించడం జరిగిందని, ఆ నివేదికల ప్రకారం గతంలో కంటే ఈ ప్రభుత్వహయాంలో
పాలనా భాషగా తెలుగు అమలులో ఎంతో పురోగతి ఉన్నట్లు ఆయన తెలిపారు.