మచిలీపట్నం : మారిటైమ్ ఆధారిత సంపదను పెంచడంలో, పోర్టులకు సంబంధించిన వసతులను
పెంపొందించడంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందుందని రాష్ట్ర
పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం
ఆయన జిల్లా కలెక్టర్ పి.రాజాబాబుతో కలిసి పలు ప్రాంతాలను పర్యటించారు. ఈనెల
22వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తపసిపూడి లోని పోర్టు నిర్మాణ పనులకు
శంకుస్థాపన చేసే సముద్రంపై నిర్మించిన వేదిక ప్రాంతం, పైలాన్ నిర్మాణ
స్థలాన్ని, హెలిపాడ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర
పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవాన్ మాట్లాడుతూ, 30 నెలల్లో
మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులు పూర్తవుతాయని, మచిలీపట్నం పోర్టు సర్వాంగ
సుందరంగా రూపుదిద్దుకుంటుందని తద్వారా జిల్లాలో 25 వేలమందికి ఉద్యోగ, ఉపాధి
అవకాశాలు కల్పించబడతాయని దీంతో ఈ ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని
తెలిపారు. పోర్టులకు అనుసంధానంగా రోడ్లు, రైళ్ల మార్గాలను నిర్మించడం సహా
పోర్టుల ద్వారా సముద్ర వాణిజ్య అనుసంధానంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి
తిరుగులేదన్నారు. మల్టీ మోడల్ కార్గో హబ్ లు, సహజ వాయువుల పంపిణీ విస్తరణ
ద్వారా పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిలో మన రాష్ట్రం దూసుకెళ్లడం ఖాయమన్నారు.
అనంతరం కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ, ఈనెల 22వ తేదీ
కృష్ణాజిల్లాలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజల
చిరకాల వాంఛ నెరవేరబోతుందన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ద్వారా
స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.పోర్టు నిర్మాణం పూర్తయితే
80 వేల టన్నుల బరువుతో వచ్చే ఓడలు సైతం సురక్షితంగా మచిలీపట్నం పోర్టుకు
రాగలుగుతాయన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా చిలకలపూడి ఈతకొలను సమీపం లోని
ఎనిమిదిన్నర ఎకరాల భారత్ స్కౌట్స్, గైడ్స్ ప్రాంతీయ శిక్షణ శిబిర మైదానంకు
చేరుకొని ముఖ్యమంత్రి బహిరంగ సభ ప్రాంగణం పరిశీలించారు. ఈ సందర్శన
కార్యక్రమంలో మచిలీపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ విద్యాశంకర్, మెగా
ప్రాజెక్ట్ హెడ్ తులసి దాస్, ఆర్డీవో ఐ. కిషోర్, తహసిల్దార్ సునీల్ బాబు, ఆర్
ఐ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.