ధర్మపరిరక్షణ పరిషత్ ఏర్పాటు చేసి రాష్ట్రమంతా ధర్మ ప్రచారం చేయాలని
ముఖ్యమంత్రి ఆదేశం
సనాతన హిందూ ధర్మం మీద సీఎం కు ఉన్న గౌరవానికి, సంకల్ప సిద్ధికి హృదయపూర్వక
కృతజ్ఞతలు
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయ సమగ్రాభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్ ను
పరిశీలించిన ముఖ్యమంత్రి
టీటీడీ తరహాలో త్వరలోనే రూ.225 కోట్ల వ్యయంతో పూర్తిగా మారనున్న దుర్గగుడి
రూపురేఖలు
మే చివరి వారంలో శ్రీశైలంలోని శివాజీ రాజగోపురంపై ముఖ్యమంత్రి చేతుల మీదుగా
బంగారు కలశం ఏర్పాటు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
విజయవాడ : రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందడం కోసం, ప్రజల ఆయురారోగ్య,
ఐశ్యర్య ప్రాప్తి కోసం, లోక కళ్యాణార్థం
వేదాలు చెప్పిన 8 ఆగమాల ప్రకారం కనివినీ ఎరుగని రీతిలో భారతదేశ చరిత్రలో
తొలిసారిగా ఆరు రోజులు నిర్వర్తించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ,
రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం, ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి తీసుకున్న యజ్ఞ సంకల్పం సంపూర్ణంగా ఫలప్రదమైందని రాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలోని యజ్ఞ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన
మీడియా పాయింట్ లో మహా పూర్ణాహుతి కార్యక్రమంతో యజ్ఞం ముగిసిన అనంతరం
పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉద్దండులైన వేద
పండితులు, 550 మంది రుత్విక్కులు, 300 మంది సహాయకులు సమక్షంలో వైఖానసం,
పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం అనే 4 ఆగమములతో యజ్ఞాలు, హోమాలు, వీరశైవం,
తంత్రసారం, గ్రామదేవతారాధన, చాత్తాద శ్రీవైష్ణవం అనే మరో 4 ఆగమాల ప్రకారం జప
పారాయణం నిర్వహించి ప్రజా సంక్షేమం చేసిన మహోన్నతమైన యజ్ఞం విజయవంతం కావడంపై
ఆనందం వ్యక్తం చేశారు. తొలి రోజు సంకల్పదీక్షను చేపట్టిన ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి యజ్ఞం చివరి రోజు స్వహస్తాలతో పండితులు నిర్ణయించిన సుముహూర్తాన
4 యాగ శాలల్లో విశేష పూజలతో మహా పూర్ణాహుతి కార్యక్రమం చేయడం జరిగిందన్నారు.
అనంతరం అభిషేక మండపంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అనంత లక్ష్మీ అమ్మవారికి
అభిషేకం చేయించి, పీఠాధిపతులు, వేద పండితులచే వేదాశీర్వచనం, అనుగ్రహ భాషణం
చేయించడం జరిగిందన్నారు. ఆశీర్వాద అనంతరం సీఎంకు నూతన వస్త్ర బహుకరణ
చేశామన్నారు. యజ్ఞం విజయవంతం కావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారని తెలిపారు.
ధర్మపరిరక్షణ పరిషత్ ఏర్పాటు చేసి రాష్ట్రమంతా ధర్మ ప్రచారం చేయాలని
ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి గొప్ప మనసుకి, సనాతన
హిందూ ధర్మం మీద ఆయనకున్న గౌరవానికి, సంకల్ప సిద్ధికి ప్రత్యేకంగా మంత్రి
కొట్టు సత్యనారాయణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమం అనంతరం రూ.225 కోట్ల వ్యయంతో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ
దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయ సమగ్రాభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్ ను
ముఖ్యమంత్రి పరిశీలించారని చెప్పారు. వాస్తు ప్రకారం, వాస్తు పండితుల,
స్థానాచార్యులు, స్తపదులు, ఢిల్లీలోని గురుగావ్ నుంచి తెప్పించిన ఆర్కిటెక్చర్
డిజైన్లు పరిశీలించిన ముఖ్యమంత్రి దుర్గమ్మ ఆలయంలో ప్రతి బిల్డింగ్ మీద ఒక
గుడి ఆకారంలో రూప్ ఉండేలా చూడాలని, దాని ద్వారా అధ్యాత్మిక శోభ
ఫరిఢవిల్లుతుందని సూచించారన్నారు. తూర్పున నిర్మాణం చేసే రాజగోపురంలో నుంచి
లక్షలాది మంది భక్తులు ప్రవేశించి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్లీ తిరిగి
తూర్పు ద్వారం గుండానే బయటికి వచ్చేలా 18 అడుగుల ఎత్తులో మెయిన్ రోడ్డు నుంచి
నిర్మాణం చేపడుతున్నామన్నారు. అబ్బురపడే ఆర్కిటెక్ తో నిర్మాణం
చేయిస్తున్నామన్నారు. నూతన డిజైన్ల ద్వారా చేసే నిర్మాణంతో రూ.300 టికెట్,
రూ.100 టికెట్, ఉచిత దర్శనంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా
ఏర్పాట్లు చేయనున్నామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల-తిరుపతి తరహాలో
మంచినీటి వసతికి, టాయిలెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. ఆగ్నేయంలో 3
అంతస్థుల్లో ప్రసాదం పోటు, ప్రసాద విక్రయ కేంద్రం, ప్రసాదాలు స్టోర్ చేసుకునే
ఏర్పాటు చేస్తామన్నారు. దాని పక్కనే భక్తులు సేదతీరేలా డార్మిటరీలు,
టాయిలెట్ల వసతి, సామూహిక కళ్యాణాలు చేసుకునేలా పెద్ద కళ్యాణ మండపం నిర్మాణాలను
చేపడుతున్నామన్నారు. అదే విధంగా అలిపిరి ఎంట్రెన్స్ లా అధ్యాత్మిక శోభ
కలిగించేలా దుర్గా గుడి ఎంట్రెన్స్ లో కూడా వైభవంగా గోపురం ఏర్పాటు
చేస్తామన్నారు. అత్యాధునిక సదుపాయాలు, టెక్నాలజీతో బీవోటీ పద్ధతిలో
దేవాలయానికి ఆదాయం సమకూరేలా 600 కార్లు పార్కింగ్ చేసుకునే నిర్మాణం
చేపడుతున్నామన్నారు. ఈనెల 25 నుండి 31వ తేదీ వరకు శ్రీశైలంలోని శివాజీ
రాజగోపురంపై ముఖ్యమంత్రి చేతుల మీదుగా బంగారు కలశం ఏర్పాటు చేయనున్నామన్నారు.
మల్లిఖార్జున స్వామి వారికి మహా కుంభాభిషేకం చేయనున్నామన్నారు. సనాతన హిందూ
ధర్మ పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రజల కళ్యాణ సౌభాగ్యాల కోసం, రాష్ట్ర
సర్వతోముఖాభివృద్ధి, అభ్యున్నతి కోసం, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తకుండా,
సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ జరిగిన
యజ్ఞానికి పదుల సంఖ్యలో విశిష్ట పీఠాధిపతులు విచ్చేసి అనుగ్రహ భాషణం చేయడం
ఆనందంగా ఉందన్నారు.
6 రోజుల పాటు పాంచరాత్ర యాగశాలలో 50వేల అవనంతో మహా సుదర్శన యాగం జరగడం
విశేషమన్నారు. వైదిక స్మార్త యాగశాలలో రాజశ్యామల మహా విద్య, చండీ పారాయణ
అవనాలు లెక్కలు మించి అంటే 2 లక్షల 25 వేలు జరగడం గొప్ప విషయమన్నారు. వైఖానస
యాగశాలలో నారాయణ గ్రహ అష్టాక్షరీ మహా లక్ష్మీ అవనాలు, వెంకటేశ్వర స్వామికి
వైభవంగా పూజలు, కళ్యాణోత్సవాలు, మహా కుండంలో జరిగిన అవనాలు ఘనంగా లెక్కకు
మించి జరిగాయన్నారు. శైవాగమ యాగశాలలో నిర్విరామంగా మహా రుద్రయాగంతో పాటు
అతిరుద్ర యాగం కూడా జోడించి చేయడం జరిగిందన్నారు. వీరశైవ ఆచారానికనుగుణంగా,
తమిళనాడుకు సంబంధించి శ్రీకాళహస్తి దేవాలయం నుంచి వచ్చిన రుత్విక్కులు వారి
శైలిలో పరమశివుడికి రుద్రయాగం చేశారన్నారు. ఇవే కాకుండా యాగశాలలో, అభిషేక
మండపంలో ఎలాంటి రాజీ లేకుండా, లెక్కకు మించి యాగ ద్రవ్యాలను వినియోగించి
రాజస్థాన్ నుంచి తెప్పించిన 108 గ్రాముల స్వర్ణ లక్ష్మీ అమ్మవారికి, కంచి
నుండి తెప్పించిన మహా లక్ష్మీ అమ్మవారికి ఆరు రోజుల పాటు ఉదయం, సాయంత్రం పెద్ద
ఎత్తున అభిషేకం గావించడం ఆనందం కలిగించిందన్నారు. పూజా ద్రవ్యాల నాణ్యత
విషయంలో రాజీ పడకుండా ప్రత్యేకంగా కశ్మీర్ లోని శ్రీనగర్ నుండి తెప్పించిన
కల్తీ లేని కుంకుమ పువ్వు, ఎక్కడా దొరకని కస్తూరిని తెప్పించి విశేష
ద్రవ్యాలతో పూజలు గావించామన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం దేవదాయ,
ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన యజ్ఞ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో,
బాధ్యతాయుతంగా నిర్వహించామని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. వేద
పండితులంతా నిస్వార్థంగా, నిజాయితీగా, ఆగమశాస్త్ర నియామానుసారం రాత్రింబవళ్లు
శ్రమించి పూజలు నిర్వహించి యజ్ఞానికి సంపూర్ణత్వం కలిగించారన్నారు. మే 12
నుండి 17 వరకు 6 రోజుల పాటు మహా మంగళవాయిద్య హృద్య నాదముల మధ్య భగవత్ ప్రీతిగా
వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర-విష్వక్సేన పూజలు, పుణ్యాహవాచనము, అజస్ర
దీపారాధన, విష్ణు సహస్ర పారాయణము, భూమాత స్తోత్ర పారాయణము, శ్రీ హనుమాన్
చాలీసా పారాయణము, చతుర్వేద పారాయణములు, శ్రీ శివ సహస్రనామ పారాయణము,
మత్స్యంగ్రహణము, అంకురారోపణము, ప్రధాన యాగశాలల యందు అగ్ని మథనం, అగ్ని
ప్రతిష్ట, అగ్ని స్థాపన,, ఆగమోక్తంగా మహాపూర్ణహుతి తదితర కార్యక్రమాలు
చేపట్టామన్నారు. ఇవే కాకుండా ప్రతిరోజూ శ్రీలక్ష్మీ అమ్మవారికి సుగంధ
ద్రవ్యాలతో, సప్తనదీ జలాలు, మూడు సముద్రాల జలాలు, ప్రత్యేకించి మానస సరోవరం
నుండి తెప్పించిన జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకం, కుంకుమార్చన, 108
కుండాలలో అర్చనలు, హోమాలు జరిపామన్నారు. యజ్ఞం జరిగినన్ని రోజులు అధ్యాత్మిక
కేంద్రంగా ఇందిరాగాంధీ మున్సిపాలిటీ స్టేడియం విరాజిల్లిందన్నారు. సాంస్కృతిక
ప్రదర్శనలు ఆహుతులను అలరించాయన్నారు. భక్తుల సౌకర్యార్థం ధర్మ ప్రచార రథాల
యందు వేంచేసియున్న వివిధ దేవతామూర్తుల దివ్యదర్శన భాగ్యం కల్పించామన్నారు.
ప్రతి రోజు భక్తులకు యజ్ఞ తీర్థ ప్రసాదాలను అందించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ
ఘటనలు చోటుచేసుకోకుండా యజ్ఞప్రసాదంగా అన్నదానం చేశామన్నారు.
దేవదాయశాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ మాట్లాడుతూ మహత్తర యజ్ఞం విజయవంతం
కావడానికి ముఖ్యకారకులు అయిన ముఖ్యమంత్రి మోహన్ రెడ్డికి, కార్యక్రమం
ఆద్యంతం కర్త, కర్మ, క్రియగా నడిపించిన ధార్మిక పరిషత్ ఛైర్మన్, దేవదాయ శాఖ
మంత్రి కొట్టు సత్యనారాయణ కృషి అసామాన్యం అని కొనియాడారు. అర్చన ట్రైనింగ్
అకాడమీ డైరెక్టర్ వేదాంత రాజగోపాల చక్రవర్తి, ఆగమ సలహాదారులు, వేద పండితులు, 4
ఆగమాలలో పాంచరాత్రంకు సంబంధించి గోపాలాచార్యులు, వైదిక స్మార్తానికి సంబంధించి
కైతేపల్లి సుబ్రహ్మణ్యం, వైఖానసం నుండి కండవల్లి సూర్యనారాయణాచార్యులు,
శైవాగమనం నుండి మృత్యుంజయ ప్రసాద్ లు, స్థానిక దుర్గగుడి స్థానాచార్యులు
శివప్రసాద్ లు, రాజమండ్రి వాస్తు సిద్ధాంతి బుట్టేవారి సలహాలు, సూచనలు, కృషితో
ఆది నుండి అంతం వరకు హైందవ సంస్కృతి పరిరక్షణ, వైదిక సంప్రదాయాలతో చేసిన యజ్ఞం
ఫలవంతం కావడం సంతోషమన్నారు. యజ్ఞంలో పాలు పంచుకొని జయప్రదం కావడానికి కృషి
చేసిన దేవదాయ, ధర్మదాయ శాఖతో పాటు విద్యుత్, మున్సిపాలిటీ, హోం శాఖ, సమాచార,
పౌర సంబంధాల శాఖ, ఆయా శాఖల సిబ్బందికి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు,
ప్రత్యేకించి భక్తి ఛానల్ వారికి, యజ్ఞంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు,
భక్తులకు ప్రత్యేకంగా మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవదాయశాఖ కమిషనర్ శ్రీరామ
సత్యనారాయణ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.