న్యూఢిల్లీ : అమరాతి రాజధాని ప్రాంతంలో ఆర్-5 జోన్ విషయంలో హైకోర్టు
ఉత్తర్వులను అమరావతి రైతులు సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించి బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్5
జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది.
వాస్తవానికి ఎలక్ట్రానిక్ సిటీ కోసం ఉద్దేశించిన ఆర్-5 జోన్లో గృహ స్థలాలను
ఈడబ్ల్యూఎస్ సమూహాలకు కేటాయించాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంలో కోర్టు
జోక్యం చేసుకోదని తెలిపింది. పట్టాలు పంపిణీ చేస్తే కనక హైకోర్టులో పెండింగ్
రిట్ పిటిషన్‌పై తుది తీర్పునకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. పట్టాదారులకు
థర్డ్ పార్టీ హక్కు ఉండదని పేర్కొంది. ఇక విచారణ సందర్భంగా రైతుల తరపున
న్యాయవాదనలు, ప్రభుత్వం తరపున న్యాయవాదులు సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు
వినిపించారు. రైతుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్రం, దేశ
ప్రయోజనాలు కోసం రైతులు భూమిలిచ్చారని చెప్పారు. అమరావతిలో మహా నగరం వస్తుందని
హామీ ఇచ్చారని.. ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు వస్తాయని ఆశ చూపారని తెలిపారు. ఆ
మాటలు నమ్మి ఎలాంటి పరిహారం తీసుకోకుండా భూములిచ్చారని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మనుసింఘ్వీ 2003 మార్చి 21న
ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. 34 వేల ఎకరాల్లో 900
ఎకరాలే ఈడబ్ల్యూఎస్‌కు ఇచ్చారని చెప్పారు. 3.1 శాతమే ఈడబ్ల్యూఎస్‌కు ఇచ్చారని
తెలిపారు. ఇక్కడున్న కేసులన్నీ వ్యక్తిగతంగా వేసినవేనని చెప్పారు. ఫ్లాట్ల
అలాట్మెంట్ పూర్తైందని తెలిపారు. లబ్దిదారుల జాబితా ప్రభుత్వం వద్ద సిద్దంగా
ఉందని చెప్పారు. జాబితా విషయాన్ని లబ్దిదారులకు ఇంకా చెప్పలేదని అన్నారు.
ఇదిలా ఉంటే రాజధాని అమరావతిలో బయట ప్రాంతాలకు చెందిన భూమిలేని పేదలకు ఇళ్ల
స్థలాల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లను
విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి
తెలిసిందే. ఇందుకు సంబంధించి రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు
కొట్టివేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూ బదలాయింపు చేస్తూ
ప్రభుత్వం జారీ చేసిన జీవో 45, దాని ప్రకారం చేసే ఇళ్ల స్థలాల కేటాయింపు తాము
ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉండాలని హైకోర్టు తెలిపింది. రాజధానిపై హైకోర్టు
ఇచ్చిన ఫుల్ బెంచ్ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించకపోవడంతో మధ్యంతర
స్టే ఇవ్వడం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని హైకోర్టు
వ్యాఖ్యానించింది. అయితే ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అమరావతి
రైతులు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.