సిద్దూకు మాత్రం ఇవ్వొద్దు.. ఖర్గేకు తేల్చిచెప్పిన డీకే
కాంగ్రెస్ చీఫ్ నివాసంలో అరగంట పాటు సమావేశం
మెజారిటీ ఎమ్మెల్యేలు సూచించినవారికే పీఠం
సిద్దూ స్పష్టీకరణ.. ఈయనకే రాహుల్ మద్దతు
డీకేపై సోనియాకు అభిమానం.. అధిష్ఠానం డైలమా
ఆమెతో చర్చించాక ఖర్గే తుది నిర్ణయం!
బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడు రోజులు గడిచినా ఎవరిని
ముఖ్యమంత్రిగా నియమించాలన్న విషయంలో కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం
తీసుకోలేకపోతోంది. మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్
మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీఎం పేరును మంగళవారం ప్రకటిస్తామని అధిష్ఠానం
ప్రకటించినా చర్చలు కొలిక్కి రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. బుధవారం
ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
మంగళవారం ఢిల్లీలో సిద్దరామయ్య, శివకుమార్‌లతో వేర్వేరుగా మంతనాలు జరిపారు.
పార్టీ సీనియర్ నేతలు, కర్ణాటక నాయకులతో కూడా చర్చలు సాగించారు. సిద్దరామయ్య
మంగళవారమే ఢిల్లీ రాగా.. కడుపునొప్పి, జ్వరం అంటూ డీకే హస్తిన పర్యటన
రద్దుచేసుకున్నారు. అయితే అధిష్ఠానం ఆదేశాలతో బుధవారం ఢిల్లీ చేరుకున్నారు.
సాయంత్రం 5 గంటలకు రాజాజీ మార్గ్‌లోని ఖర్గే నివాసానికి వెళ్లారు. అరగంట పాటు
చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఖర్గే ముఖ్యమంత్రి అయితే తనకు
అభ్యంతరం లేదని డీకే స్పష్టంచేశారు. ‘చేస్తే నన్ను సీఎంను చేయండి. లేదంటే
సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతా. ఇంకే పదవీ వద్దు’ అని కుండబద్దలు కొట్టినట్లు
చెప్పారని తెలిసింది. అదీగాక సిద్దూకు ఇప్పటికే ఒకసారి అవకాశమిచ్చారని,
ఐదేళ్లు ఆయన సీఎంగా అధికారం అనుభవించారని తెలిపారు. ఆయన దుష్పరిపాలన
సాగించారని, కర్ణాటకలోని ప్రధాన సామాజిక వర్గమైన లింగాయత్‌లు ఆయనకు ఎదురు
తిరిగారని గుర్తుచేశారు. ఇప్పుడు తనకు అవకాశమివ్వాలని కోరారు. 2006లో సిద్దూ
కాంగ్రెస్ పార్టీ లర్ చేరినప్పటి నుంచి పదవులు అనుభవించారని ప్రస్తావించారు.
రెండుసార్లు ప్రతిపక్ష నేతగా, ఒకసారి ఐదేళ్ల పూర్తికాలం సీఎంగా పనిచేశారని
తెలిపారు. ఆయన వల్ల ఖర్గేకు కూడా సీఎం పదవి రాకుండా పోయిందని గుర్తుచేశారు.
తనను కాకుంటే దళితుడినైనా ముఖ్యమంత్రిని చేయాలని, సిద్దరామయ్యకు మాత్రం పదవి
ఇవ్వొద్దని చెప్పారు. 2019లో కాంగ్రె్స-జేడీఎస్ సంకీర్ణం కుప్పకూలాక
రాష్ట్రంలో పార్టీని తానే పునర్నిర్మించానని తెలిపారు. డీకే వెళ్లిపోయాక
సాయంత్రం ఆరు గంటలకు సిద్దూ వచ్చి ఖర్గేతో చర్చలు జరిపారు. మెజారిటీ
ఎమ్మెల్యేల అభిమతం మేరకు సీఎం పదవిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2013-18
నడుమ సీఎంగా తన విజయాలను వివరించారు. అంతకుముందే అగ్ర నేత రాహుల్‌గాంధీ,
కర్ణాటక ఇన్చార్జి రణదీప్ సుర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ
వేణుగోపాల్ అధ్యక్షుడిని కలిసి గంటన్నర మంతనాలు జరిపారు. రాహుల్,
వేణుగోపాల్ సిద్దూకే మద్దతిస్తున్నారని, మెజారిటీ ఎమ్మెల్యేల ఓటు కూడా
ఆయనకేనని పార్టీలోని ఓ వర్గం అంటోంది. అయితే డీకేకు సోనియాగాంధీ ఆశీస్సులు
ఉన్నాయని, పీసీసీ అధ్యక్ష పదవిని ఆమే ఆయనకు అభిమానంతో అప్పగించారని, ఈడీ
కేసులో ఆయన జైలులో ఉన్నప్పుడు స్వయంగా వెళ్లి పరామర్శించారని ఆయన సన్నిహిత
వర్గాలు చెబుతున్నాయి. నేతలతో ఖర్గే చర్చలు పూర్తయినట్లేనని ఆదివారం నాటి
సీఎల్పీ భేటీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రహస్య ఓటింగ్ ద్వారా తమ
అభిప్రాయం తెలియజేశారని, దీనిపై సోనియాతో చర్చించాక బుధవారం నిర్ణయం
ప్రకటిస్తారని పేర్కొన్నాయి.
వెన్నుపోటు పొడవను: డీకే
కాంగ్రెస్ పార్టీయే తనకు కన్నతల్లి అని, పార్టీని తాము నిర్మించామని,
రాజీనామా చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని డీకే శివకుమార్ అన్నారు. తాను
రాజీనామా చేస్తున్నట్లు ఏదైనా చానల్ ప్రసారం చేస్తే పరువునష్టం దావా
వేస్తానని హెచ్చరించారు. ‘పార్టీ నాకు దేవాలయం. వెన్నుపోటు పొడవను.
బ్లాక్మెయిల్ చేయను. నాకు అర్హత ఉంటే సీఎం పదవి నాకే ఇస్తారు. ఆందోళన
ఎందుకు? మేమంతా ఐకమత్యంగా ఉన్నాం. మా ఎమ్మెల్యేల సంఖ్య 135. ఎవరినీ చీల్చాలని
అనుకోవడం లేదు. నేనంటే వారికి ఇష్టం ఉన్నా, లేకున్నా నేను బాధ్యతాయుతమైన
వ్యక్తిని. పార్టీయే మాకు కొండంత బలం’ అని స్పష్టం చేశారు. సీఎం పదవి కోసం
పోటీ నేపథ్యంలో దళితులకు సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ
వర్గానికి చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర
తనకు సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు.
స్వతంత్రుల మద్దతు : కాంగ్రెస్ బలం 138
కర్ణాటక శాసనసభలో కాంగ్రెస్ బలం 138కి పెరగనుంది. మొన్నటి ఎన్నికల్లో ఆ
పార్టీ బలపరచిన సర్వోదయ పార్టీ నేత, మేలుకోటె ఎమ్మెల్యే దర్శన్ పుట్టణ్ణయ్య
ఇప్పటికే మద్దతు ప్రకటించారు. తాజాగా హరపనహళ్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా
గెలుపొందిన లతా మల్లికార్జున, చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూరు నుంచి
గెలుపొందిన కేహెచ్ పుట్టస్వామి గౌడ మంగళవారం కాంగ్రె్‌సకు మద్దతు తెలిపారు.
లింగాయత్‌లకే ఇవ్వాలి: వీరశైవ మహాసభ
కురుబ వర్గానికి చెందిన సిద్దరామయ్యకో, వొక్కళిగుడైన శివకుమార్కో గాక తమ
లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేతకే సీఎం పదవి ఇవ్వాలని అఖిల భారత
వీరశైవ మహాసభ కోరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 34 మంది లింగాయత్‌లు
ఉన్నారని, తమ వర్గం జనాభా అధికంగా ఉన్న మరో 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి
మద్దతిచ్చామని, దశాబ్దాలుగా బీజేపీతో ఉన్న తమ వర్గమంతా ఈ సారి కాంగ్రెస్ వైపు
మొగ్గు చూపిందని, అందుచేత తమకు సీఎం పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. ఈ మహాసభలో కీలక లింగాయత్ నేతలు సభ్యులుగా
ఉన్నారు. దీని అధ్యక్షుడు 91 ఏళ్ల షామనూరు శివశంకరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యే
కూడా మొన్నటి ఎన్నికల్లో దావణగెరె దక్షిణం నుంచి గెలిచారు.