ఈ – గరుడ ఏసీ బస్సులు లాంఛనంగా ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకుల సౌకర్యార్థం
పర్యావరణ హితమైన ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోందని, ఈ-బస్సులను
ప్రవేశపెట్టడంలో టి.ఎస్.ఆర్టీసీ దేశంలోనే అగ్రగామి నిలిచిందని రవాణా శాఖ
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన
ఈ-గరుడ బస్సులను మంగళవారం సాయంత్రం హెదరాబాద్లోని మియాపూర్లో సంస్థ
ఛైర్మన్, ఎం.ఎల్.ఎ బాజిరెడ్డి గోవర్ధన్ గారితో పాటు వి.సి అండ్ ఎం.డి
వి.సి.సజ్జనర్తో కలిసి ఆయన లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం
ఈ కొత్త బస్సులో కొద్ది దూరం ప్రయాణించి అందులోని సదుపాయాలను
పరిశీలించారు. అంతకుమందు ఆయన మాట్లాడుతూ, జన సాంద్రత కలిగిన నగరాల్లో
శిలాజ ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం
జరుగుతోందని, పర్యావరణ అనుకూల ప్రజా రవాణాను అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర
ఎలక్ట్రిక్ వెహికిల్ విధానానికి అనుగుణంగా టి.ఎస్.ఆర్టీసీ ఈ-గరుడ
బస్సులను సమకూర్చుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఇటీవల కాలంలో
టి.ఎస్.ఆర్టీసీ కొత్తగా సూపర్ లగ్జరీ, ఏసీ స్లీపర్ మొత్తం 760
బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ కొత్త
బస్సుల రాకతో మళ్లీ 10 వేల బస్సులకు చేరువ అవుతుండటం శుభపరిణామన్నారు.
ఎలక్ట్రిక్ బస్సులకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని,
ప్రజలకు మరింత చేరవయ్యే విధంగా మరింత మెరుగైన రవాణా సేవలు
అందించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు.
సంస్థ ఛైర్మన్, ఎం.ఎల్.ఎ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ హైదరాబాద్
నగరం నుంచి ప్రతి రోజు 50 వేల మంది విజయవాడ, రాజమండ్రికి
ప్రయాణీస్తున్నారని పేర్కొంటూ ఈ – గరుడ బస్సులను విజయవాడకు
నడుపుతున్నట్లు చెప్పారు.
ప్రైవేట్ రవాణా సేవలకు ధీటుగా టి.ఎస్.ఆర్టీసీ మెరుగైన సదుపాయాలు
కల్పిస్తుండటంతో ప్రజలు ఆదరిస్తున్నారని, ప్రతి ఏటా ప్రభుత్వం రూ.1500
కోట్లు టి.ఎస్.ఆర్టీసీకి కేటాయిస్తూ ఆదుకుంటోందన్నారు. గత సంవత్సరన్నర
కాలంగా సంస్థలో ఎన్నో మంచి మార్పులు తీసుకురావడం జరిగిందని,
భవిష్యత్తులో 2 వేల బస్సులు రాబోతున్నాయని వెల్లడించారు. ఆధునిక హంగులతో
రూపుదిద్దుకున్న ఈ – గరుడ బస్సులను కూడా ప్రయాణీకులు ఆదరించనున్నారని
తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
పర్యావరణ హితం కోసం…
సంస్థ వి.సి అండ్ ఎం.డి శ్రీ వి.సి.సజ్జనర్, ఐ.పి.ఎస్
“ఇదొక చారిత్రాత్మకంగా నిలిచే రోజు..మెుట్ట మెుదటి సారిగా టి.ఎస్.ఆర్టీసీ
ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడుపుతుంది. రానున్న రోజుల్లో మరిన్ని
ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నగరంలో 10 డబుల్
డెక్కర్ బస్సులతో పాటు మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందించనున్నాయి.
డీజిల్ భారం నుంచి ఉపశమనం పొందడానికి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశం పెట్టడం
జరుగుతోంది. పర్యవరణ హితం కోరుతూ కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం ఎలక్ట్రిక్
బస్సులను ప్రయాణీకులకు అందుబాటులో తీసుకు రావడమవుతుంది. ఈ బస్సుల్ని
హైదరాబాద్ నుంచి విజయవాడకు సంస్థ నడుపుతుంది. మధ్యలో చార్జింగ్ కోసం 20
నిముషాల పాటు సూర్యాపేటలో ఆగుతున్నాయి” అని సంస్థ వి.సి అండ్ ఎం.డి శ్రీ
వి.సి.సజ్జనర్, ఐ.పి.ఎస్ గారు అన్నారు .
గత సంవత్సరన్నర కాలంగా టి.ఎస్.ఆర్టీసీలో అనేక సంస్కరణ లు తీసుకు రావడం
జరిగిందని, అన్నింటినీ ప్రజలు స్వాగతిస్తున్నారని, ఇదే రకంగానే కొత్త
బస్సుల సేవల్ని కూడా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ
పదీప్ గారు మాట్లాడుతూ, గ్రాస్ కాస్ట్ ఆన్ కాంట్రాక్ట్ పద్దతిలో 560
ఎలక్ట్రిక్ బస్సులను టి.ఎస్.ఆర్టీసీకి సమకూర్చనున్నట్లు చెప్పారు.
దేశంలోనే అతి తక్కువ రేటుతో ఒప్పందం చేసుకునేందుకు సంస్థ అధికారులు తమను
ఒప్పించారని తెలిపారు.
ఈ- గరుడ బస్సులు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు
ప్రయాణించవచ్చని, మొదటి దశలో 10 బస్సులను అందించామని, మిగతా
బస్సులను కూడా త్వరలో అందించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్యెల్యే అరికపూడి గాంధీ, టీఎస్ఆర్టీసీ చీఫ్
ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్
సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు పురుషోత్తం, మునిశేఖర్, సంస్థ అధికారులు
కృష్ణకాంత్, రఘునాథ రావు, విజయ కుమార్, రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్
ఆర్ఎంలు శ్రీధర్, వరప్రసాద్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.