హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి
అప్పలరాజు, అప్సడా చైర్మన్ వడ్డి రఘురాం
ఆక్వా ఉత్పత్తుల ధరలు, ఫిష్ ఆంధ్రా యూనిట్లపై సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా 46,445 మంది రైతులకు ఆక్వా విద్యుత్ సబ్సిడీ
ఈ ఫిష్ సర్వేతో చిన్న రైతులకు పెద్ద మేలు
3.27 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుకు ఏటా రూ.672 కోట్ల సబ్సిడీ
ఆక్వాఫీడ్, సీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరీకరణ
ఇప్పటికే 1549 యూనిట్ల ఏర్పాటు
ఆక్వా సాధికారిత కమిటీ
విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రీయంగా నిర్వహించిన ఈ ఫిష్ సర్వే వల్ల
లక్షలాధి మంది అర్హులైన చిన్న ఆక్వారైతులకు ప్రభుత్వ సబ్సిడీ చేరువ అయ్యిందని
ఆక్వా సాధికారిత కమిటీ సభ్యులు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స
సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు తెలిపారు. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం 6వ ఆక్వా సాధికారిత కమిటీ
సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ఆక్వా జోన్ పరిధిలో పది
ఎకరాలలోపు సాగు చేస్తున్న ప్రతి ఆక్వా రైతుకు ప్రభుత్వం నుంచి విద్యుత్
సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఫిష్ సర్వే ద్వారా
అర్హులైన ఆక్వా రైతులను గుర్తించడం జరిగిందని అన్నారు. సర్వే తరువాత
రాష్ట్రంలో 46,445 మంది రైతులను అర్హులుగా నిర్ధారించడం జరిగిందని, దాదాపు
3,27,575 ఎకరాలకు, విద్యుత్ సబ్సిడీగా ఏటా రూ.672.61 కోట్లు అందిస్తున్నామని
తెలిపారు. ఈ ఫిష్ సర్వేకు ముందు ఆక్వాజోన్ పరిధిలో పది ఎకరాల లోపు ఆక్వా సాగు
చేస్తున్న విస్తీర్ణం కేవలం 1.90 లక్షల ఎకరాలకు మాత్రమే సబ్సిడీ అందితే, సర్వే
తరువాత 3.27 లక్షల ఎకరాలకు సబ్సిడీ లబ్ధి చేకూరుతోందని తెలిపారు. ఎక్కువ మంది
అర్హులైన చిన్న రైతులు ఆక్వాజోన్ పరిధిలో ఈ పరిమితుల్లోకి రావడం వల్ల వారికి
మేలు జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఆక్వారంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం
శ్రీ వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే
రాష్ట్రంలో ఆక్వారైతులకు అండగా నిలిచేందుకు, వారి సమస్యలను తక్షణం పరిశీలించి,
పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులతో ఏర్పాటు చేసిన సాధికారిత కమిటీ ఇప్పటి
వరకు పలుసార్లు సమావేశమై తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నామని
అన్నారు. ఆక్వా ఫీడ్, సీడ్ రేట్లను స్థిరీకరించడం, ఆక్వా ఉత్పత్తుల ధరలను పది
రోజుల పాటు ఒకేలా కొనసాగేలా చర్యలు తీసుకోవడం, ఈ రేట్లను ఆర్బీకేల్లో
ప్రదర్శించడం ద్వారా రైతులు, ప్లాంట్ నిర్వాహకుల్లో అవగాహన కల్పిస్తున్నామని
తెలిపారు. ఎక్కడికక్కడ రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్, ఫీడ్ తయారీదారులతో
సమావేశాలు నిర్వహించడం ద్వారా ఆక్వాలో రేట్ల పెరుగుదల, ఆకస్మికంగా ధరల పతనం
లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆక్వా
ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు, స్థానికంగా ఆక్వా
వినియోగంను పెంచేందుకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు, సబ్సిడీలతో మొత్తం 4 వేల
ఫిష్ ఆంధ్రా ఆక్వా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని అన్నారు.
ఇప్పటికే 1549 యూనిట్లను ఏర్పాటు చేయడం పూర్తయ్యిందని, ఒక్క రాయలసీమ
జిల్లాల్లోనే 360 యూనిట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. మొత్తం 2500 యూనిట్లకు
సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ప్రక్రియ తుది దశలో ఉందని తెలిపారు.
నిరుద్యోగ యువత ఉత్సాహంగా ఫిష్ ఆంధ్రా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందకు
వస్తున్నారని, అటు ఆక్వా రంగానికి, ఇటు యువత ఉపాధికి బాటలు వేస్తూ ఫిష్ ఆంధ్రా
యూనిట్ల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా అప్సడా చైర్మన్ వడ్డి
రఘురాం మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ లో ఆక్వా ఉత్పత్తుల ధరలను
ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు, ఎగుమతి దారులకు అవసరమైన సమాచారంను
అందిస్తున్నామని తెలిపారు. మధ్య దళారీల ప్రమేయంను పూర్తి స్థాయిలో
నియంత్రించడం, రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ ల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు
సమావేశాలను నిర్వహించడం ద్వారా రేట్లు పతనం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని
వివరించారు. సీడ్ రేట్లు పెరుగుదలకు సంబంధించి అప్సడాకు సమాచారం ఇచ్చిన
తరువాతే, వాటిని శాస్త్రీయంగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకుంటున్నామని,
రైతులపై అధిక భారం లేకుండా, అటు సీడ్, ఫీడ్ తయారీ సంస్థలకు ప్రోత్సాహకరంగా
ఉండేలా రేట్లను ప్రభుత్వ పరంగా నియంత్రించగలిగామని తెలిపారు. సమావేశంలో
పాల్గొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీలు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయానంద్,
గోపాలకృష్ణ ద్వివేది, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పిసిబి చీఫ్ ఇంజనీర్
శివారెడ్డి పాల్గొన్నారు.