తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ( తానా ) కార్యాలయాన్ని
ప్రారంభించిన వినోద్ కుమార్
హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, ఆరోగ్య తెలంగాణ కోసం
వైద్యులు తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్
బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం కోఠిలోని ఇండియన్ మెడికల్
అసోసియేషన్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్
హోమ్స్ అసోసియేషన్ ( తానా ) కార్యాలయాన్ని వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ
సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, అందు
కోసం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు
దక్కుతుందని అన్నారు. వైద్య, ఆరోగ్యం, విద్యా ప్రభుత్వ ప్రధాన అజెండా అని, ఆ
దిశలోనే ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోందని వినోద్ కుమార్
పేర్కొన్నారు. తానా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వీ రాకేష్, ప్రధాన కార్యదర్శి
డాక్టర్ ఎం.వీ. ప్రసాద్, వైస్ చైర్మన్ డాక్టర్ సీ.హెచ్. జగన్ మోహన్ రావు
ఆధ్వర్యంలో వినోద్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.