నెల్లూరు జిల్లా : సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఈదూరు
గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఈదూరు,
మిట్టపాళెం, రాయపురం, ఇసుకదొరువు గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ,
సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
పర్యటించారు. మంత్రికి భారీ గజమాలలతో సత్కరించి, గ్రామస్తులు, స్థానిక
నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రతి గడపలోనూ మంత్రికి మంగళహారతులతో ప్రజలు
స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు
కోరుకున్న అభివృద్ధి పనులు చేపట్టడం, సంపూర్ణంగా సంక్షేమ పథకాలు అందించడమే
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. తోటపల్లి గూడూరు
మండలంలో మరో సచివాలయం మినహా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి
కావచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రత్యేక దృష్టి
పెట్టి, పూర్తి చేస్తున్నాం.
తాను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి, సంక్షేమ పథకాల ద్వారా మీకు లబ్ది
జరిగి ఉంటేనే, తనకు తోడుగా ఉండండి అంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాము, ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను
గుర్తించి చేపడుతున్నామన్నారు. గడపగడప కార్యక్రమంలో ప్రజలు కోరుకున్న
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడం, ఆ పనులను పర్యవేక్షించేందుకు
ప్రత్యేక చర్యలు చేపట్టామని, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలకు
పరిష్కార మార్గం చూపుతున్నామన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల
భూముల సమస్యను పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని,
అన్ని రకాలుగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు, గ్రామాలను
అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.