భూ యాజమాన్యానికి భరోసా ఇస్తున్న ధరణీ
భూముల క్రయ విక్రయాలు జరిగిన వెంటనే ధరణీలో నమోదు
దేశానికే ఆదర్శం ధరణీ వ్యవస్థ
ధరణీ పై విమర్శలు చేయడం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి తగదు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ : దశాబ్దాల కాలం నుంచి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ రికార్డ్స్ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ” ధరణీ ” పోర్టల్ ను అమలులోకి తీసుకుని వచ్చిందని, కానీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి ధరణీ పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వివిధ రకాల భూ రికార్డ్స్ సమస్యలను పరిష్కారం చూపుతున్న ధరణి వ్యవస్థపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేయడం తగదు అని వినోద్ కుమార్ అన్నారు.
దశాబ్దాల కాలం నుంచి అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డులను ధరణి ద్వారా ఒక పద్ధతి ప్రకారం సరిచేసుకునే వెసులుబాటు కలుగుతోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ధరణి ద్వారా ఇప్పటివరకు 95 శాతం వరకు రెవెన్యూ రికార్డ్స్ సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగతా రికార్డ్స్ సమస్యలు త్వరలోనే కొలిక్కి వస్తాయని వినోద్ కుమార్ తెలిపారు. ఆచరణలో ఎదురవుతున్న దశాబ్దాల కాలం నాటి రెవెన్యూ రికార్డ్స్ సమస్యలు అక్కడక్కడ కొన్ని అధికారుల దృష్టికి వస్తున్నాయని, కుటుంబ కలహాలు, భూముల సరిహద్దు వివాదాలు, పూర్వపు క్రయ విక్రయాల సమస్యలు, టెక్నికల్ మాడ్యుల్ – 33 లో కొన్ని అంశాలు మాత్రమే కలెక్టర్స్ వద్ద పరిష్కారం కోసం ఉన్నాయని వినోద్ కుమార్ తెలిపారు. వాటిని కూడా దశల వారీగా అధికారులు కొలిక్కి తీసుకుని వస్తున్నారని వినోద్ కుమార్ అన్నారు. పూర్తిగా పారదర్శకతతో ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ధరణి సిస్టంను తప్పు పట్టడం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తగదని, కచ్చితమైన సమస్యను చూపితే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వినోద్ కుమార్ తెలిపారు. కొన్ని సమస్యలను సాకుగా చూపి మొత్తం ధరణి వ్యవస్థను తప్పు పట్టడం సరికాదని వినోద్ కుమార్ అన్నారు. ధరణి వ్యవస్థ అమలులో వచ్చిన నాటి నుంచి రెవెన్యూ రికార్డ్స్ అన్నీ సాఫీగా సాగుతున్నాయని, ధరణి వ్యవస్థ అమలులో వచ్చిన నాటి నుంచి జరుగుతున్న భూముల క్రయ, విక్రయాల రికార్డ్స్ అన్ని వెంటనే ధరణి లో నమోదు అవుతున్నాయని వినోద్ కుమార్ తెలిపారు.
దశాబ్దాల క్రితం నాటి రెవెన్యూ రికార్డ్స్ లో మాత్రమే కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా దశల వారీగా అధికారులు పరిష్కరిస్తున్నారని వినోద్ కుమార్ వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలు జరుగుతున్న ధరణి వ్యవస్థను కేంద్ర వ్యవసాయ, ఐ.టీ. మంత్రిత్వ శాఖల అధికారులు మెచ్చుకున్నారని, ధరణీ తరహా వ్యవస్థను దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని కూడా కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులు సూచించిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు.