రూ.197 కోట్లతో రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్ ప్లాంట్ ప్రారంభం
ఇందులో అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తి
టెలీకమ్యూనికేషన్స్, ఈవీలు, మైక్రోఎల్రక్టానిక్స్, విండ్ టర్బైన్స్ లు, యుద్ధ విమానాల్లో వీటి వినియోగం
3,000 కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు
వర్చువల్ విధానంలో ఆర్ఈపీఎంని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
విశాఖపట్నం : భారతదేశ కీలక రక్షణ కేంద్రంగా ఇప్పటికే వెలుగొందుతున్న విశాఖపట్నం సిగలో మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. యుద్ధ విమానాలు, ఆయుధాల్లో వినియోగించే అరుదైన అయస్కాంతాల తయారీ కేంద్రమైన రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్ ప్లాంట్ (ఆర్ఈపీఎం) సేవలకు శ్రీకారం చుట్టారు. రూ.197 కోట్లతో ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్) ఈ ప్లాంట్‌ని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ప్రాంగణంలో పూర్తిచేసింది. ఏడాదికి 3 వేల కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మితమైన ఈ ప్లాంట్‌ను నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. అచ్యుతాపురంలోని ‘బార్క్’ కేంద్రం సమీపంలో 2.92 ఎకరాల విస్తీర్ణంలో ఆర్ఈపీఎం నిర్మాణ పనులు 2021లో ప్రారంభం కాగా.. ఈ ఏడాది మార్చిలో పూర్తయ్యాయి. ఈ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఈఎల్ దీనిని ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా నిర్మించింది. ఏడాదికి 3 వేల కిలోల అరుదైన అయస్కాంతాల ఉత్పత్తి సామర్థ్యంలో ప్లాంట్ సేవలు మొదలయ్యాయి.
యుద్ధ విమానాల్లో వినియోగించేలా : ఈ ప్లాంట్‌లో సమారియం, కోబాల్ట్, నియోడైమియం, ఐరన్, బోరాన్ వంటి అరుదైన అయస్కాంతాలను ఉత్పత్తి చేయనున్నారు. వీటిని టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, మైక్రో ఎలక్ట్రానిక్స్, విండ్ టర్బైన్ల నిర్మాణంలో వినియోగిస్తారు. ముఖ్యంగా యుద్ధ విమానాలు, మిస్సైల్స్ వంటి అత్యాధునిక ఆయుధాల తయారీలోనూ ఈ తరహా అరుదైన మాగ్నెట్స్‌ని ఉపయోగిస్తుంటారు. అంతేకాక ఇటీవల తయారవుతున్న హైటెక్నాలజీ ఉత్పత్తుల్లో రేర్ మాగ్నెట్స్ కీలకంగా మారనున్నాయి. ఇన్నాళ్లూ వీటిని వివిధ దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునేవాళ్లు. దీనివల్ల అణుశక్తి, క్షిపణులు, రక్షణ విభాగంలో పరికరాల తయారీ, అంతరిక్షం, ఇతర వ్యూహాత్మక రక్షణ వ్యవస్థల్లో అభివృద్ధికి కొంచెం అవరోధంగా ఉండేది. దీంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటి తయారీకి శ్రీకారం చుట్టారు. ఇక ఈ రేర్ మాగ్నెట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో ఎగుమతుల విషయంలోనూ భారత్ తనదైన ముద్ర వేసుకోనుంది.