బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి మద్దతుగా నిలిచారు.
కోల్కతా: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి మద్దతుగా నిలిచారు. బీసీసీఐ చీఫ్గా గంగూలీ పదవీ కాలాన్ని పొడిగించకుండా..
అతడి స్థానంలో రోజర్ బిన్నీని ఎందుకు నియమించారని ప్రశ్నించారు. 2019 నవంబర్ 19న బీసీసీఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ పదవీ కాలం ఇటీవల ముగియగా.. బీసీసీఐ ఆయన్ను మరోసారి ఆ పదవిలో కొనసాగించకుండా పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే మమతా బెనర్జీ గంగూలీని ఐసీసీకి పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అయితే, బీసీసీఐ చీఫ్గా రెండోసారి గంగూలీని కొనసాగించకపోవడంపై ఆమె గురువారం విలేకర్లతో మాట్లాడారు.‘‘ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గంగూలీని ఎందుకు అనుమతించలేదు? ఎవరైనా పోటీ చేస్తారనే కదా ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచారు.
ఇది గంగూలీకి జరిగిన అన్యాయమే. అతడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. గంగూలీ చాలా అర్హతలు ఉన్నవాడు. దేశం గర్వపడేలా చేశాడు. అతడిని పక్కన పెట్టడానికి కారణమేంటి? ఆ పదవిని మరెవరికో కట్టబెడుతున్నారు. కారణమేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నా? సచిన్ తెందూల్కర్ పోటీలో ఉంటే అతడికీ నేను మద్దతు ఇచ్చేదాన్ని. గంగూలీ ఎంతో వినమ్రత కలిగిన వ్యక్తి. అతడు ఏమీ మాట్లాడలేదు.
కానీ కచ్చితంగా బాధపడుతున్నాడని మాత్రం నాకు తెలుసు. ఎవరో వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడానికి ఇలాంటి రాజకీయ ప్రతీకారానికి పాల్పడటం సిగ్గుచేటు’’ అని దీదీ పేర్కొన్నారు. మరోవైపు, బీసీసీఐ అధ్యక్ష పదవికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య రాజకీయ విమర్శలు కొనసాగాయి. గంగూలీ భాజపాలో చేరేందుకు అంగీకరించకపోవడం వల్లే రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే, భాజపా దీటుగా బదులిచ్చింది. తృణమూల్ కాంగ్రెస్సే రాజకీయాలు చేస్తోందని.. ముందు బెంగాల్లో క్రీడలను అభివృద్ధిచేసేందుకు దృష్టిపెట్టాలని హితవుపలికింది.