ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
మండల స్టాకు పాయింట్ నుండి పాఠశాలలకు చేరేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయండి
మే 30 నుంచి నాణ్యతా ప్రమాణాలతో కూడిన జేవీకే కిట్లు పాఠశాలలకు సరఫరా చేయాలి
విజయవాడ : జగనన్న విద్యాకానుక కిట్లను మండల స్టాకు పాయింట్ నుండి పాఠశాలలకు
స్కూల్ కిట్లు అందించేందుకు ముందస్తుగానే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని, ఈ
నెల 30 నుండి పాఠశాలలకు సరఫరా ప్రారంభించాలని, ఈ లోపు నాణ్యతా ప్రమాణాలతో
కూడిన పూర్తి కిట్ సిద్ధం చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. శుక్రవారం జగనన్న విద్యాకానుక సరఫరా తీరుపై పాఠశాల
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు పాఠశాల విద్యాశాఖ,
సమగ్ర శిక్షా అధికారులతో సమీక్షించారు. ప్రతి వస్తువు నాణ్యత పరిశీలనతో పాటు
పాఠశాలలు తెరిచేనాటికి క్షేత్రస్థాయిలో ప్రతి విద్యార్థికి పూర్తి కిట్ అందేలా
చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలి : గురువారం నాటికి (11.05.23) బ్యాగులు
1,47,238, నోటు పుస్తకాలు 26,55,075, బూట్లు 2,18,367, యూనిఫాం 9,21,796,
బెల్టులు 4,01,762, డిక్షనరీలు 4,62,069 మండల స్టాకు పాయింట్లకు చేరాయని
తెలిపారు. సెమిస్టర్ 1 కు సంబంధించి 3.54 కోట్లు పాఠ్యపుస్తకాలకు గానూ 1.94
కోట్ల పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రాలకు అక్కడి నుండి 1.24 కోట్లు పాఠ్య
పుస్తకాలు మండల స్టాకు పాయింట్లకు చేరాయని తెలిపారు. ఇంకా రవాణాలో
(ట్రాన్సిట్) లో బ్యాగులు 4,94,752, నోటు పుస్తకాలు 17,57,697, బూట్లు
6,07,129, యూనిఫాం 5,44,956, బెల్టులు 2,95,951 ఉన్నాయని తెలిపారు. మండల
స్టాకు పాయింట్ దగ్గర సరఫరాదారుల నుండి వస్తువులను స్వీకరించడం, వస్తువుల
లెక్కింపు, స్టాకు రిజిస్టరు నిర్వహించడం, నాణ్యత తనిఖీల దగ్గర జాగ్రత్త
వహించాలని కోరారు. తద్వారా విద్యార్థులకు ఉత్తమమైన వస్తువులు
అందించినవారమవుతామని పేర్కొన్నారు. ప్రతి మండల స్టాకు పాయింట్ వద్ద ఈ నెల 30
తేదీ నాటికి ‘క్వాలిటీ వాల్’ ఏర్పాటు చేయాలని అన్నారు. అలానే సరఫరాదారుల నుంచి
వచ్చిన వస్తువుల్లో అందుకున్నవి, తిరస్కరించిన వాటి వివరాలను డెలివరీ
చలానాల్లో మండల విద్యాశాఖాధికారి సంతకం చేసి, జగనన్న విద్యాకానుక యాప్లో
అప్లోడ్ చేయాలని ఆదేశించారు. పాడైన, బాగాలేని వస్తువులను వెంటనే భర్తీ
చేయాలని తెలిపారు. మండల స్టాకు పాయింట్ నుండి పాఠశాలకు స్కూల్ కిట్ అందించేలా
రూట్ మ్యాప్ రూపొందించుకోవాలన్నారు. తమ తమ స్థాయిల్లో అందరూ సమన్వయంతో పని
చేస్తే పని భారం తగ్గుతోందని, డెలివరీ స్థితిపై మండలస్థాయిలో నిరంతర
పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అధికారులు
తనిఖీలు వచ్చినప్పుడు సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్షా రాష్ట్ర
పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.