రిజిస్ట్రేషన్ 22(1)ఏ నుంచి డీనోటిఫై చేశాం
భూములపై రైతులకు సర్వహక్కులు లభించాయి
2,06,171 ఎకరాల భూములకు సంపూర్ణ హక్కులు
రూ.20 వేల కోట్ల మార్కెట్ విలువైన భూములకు సంపూర్ణ హక్కు
రైతులకు మంచి చేస్తున్నా ఓర్వలేకపోతున్నవిపక్షాలు
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల పరిధిలోనే ధాన్యం కొనుగోళ్లు చేసేలా
చర్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై .ఎస్ జగన్ మోహన్ రెడ్డి
కావలి : దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూ సమస్యను పరిష్కరించామని సీఎం
జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన
కార్యక్రమంలో చుక్కల భూముల రైతులకు సీఎం హక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ
సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో భూసర్వే
చేయిస్తున్నామని, 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీని వేగవంతం చేశామని
చెప్పారు. రూ.20వేల కోట్ల విలువైన చుక్కల భూములకు సంపూర్ణ హక్కు
కల్పిస్తున్నట్లు జగన్ వివరించారు. ‘‘17,476 రెవెన్యూ గ్రామాలకు గాను
ఇప్పటికే 2 వేల గ్రామాలకు సంబంధించి భూసర్వే నుంచి మొదలుపెట్టి హక్కు పత్రాలు
అందించే వరకు అన్ని ఏర్పాట్లు చేశాం. సుమారు 7 లక్షలకుపైగా భూహక్కు పత్రాలను
అన్ని రకాలుగా అప్డేట్ చేసి రైతులకు అందించామని వివరించారు. గ్రామాల్లోని
భూములకు సరిహద్దు రాళ్లు పాతించాం. ఈ 2వేల గ్రామాలకు సంబంధించి ఈ నెల 20వ
తేదీలోగా అన్ని పనులు పూర్తి చేస్తాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి 2వేల గ్రామాల
చొప్పున భూహక్కు పత్రాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రతి అడుగులో
కూడా రైతులకు మంచి జరగాలనే ఆలోచనతోనే ఇవన్నీ చేస్తున్నాం. రైతన్నకు తోడుగా
ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుంచి మొదలుపెడితే అనేక
కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల
పరిధిలోనే ధాన్యం కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకున్నాం. ధాన్యం కొనుగోలు
చేసిన వెంటనే 21రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నాం. రైతన్నల మనసు, వారి కష్టం
తెలిసిన ప్రభుత్వంగా ఈ నాలుగేళ్లలో రైతులకు అండగా ఉండేందుకే ప్రతి అడుగు
వేశాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్నదాతలకు మంచి చేస్తున్నామని,
రాష్ట్రంలోని రైతుల కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ విపక్షాలు
ఓర్వలేక పోతున్నాయని జగన్ పేర్కొన్నారు.
దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యకు విముక్తి కల్పించామని, గత
ప్రభుత్వం చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చిందన్నారు. చంద్రబాబు రైతులను
కోలుకోని దెబ్బ కొట్టార ని, భూములు అమ్ముకునే పరిస్థితి లేదని, చుక్కల భూముల
హక్కుతో బ్యాంకు రుణాలు తీసుకోవచ్చని, వారసత్వపు ఆస్తిగా అందించడానికి
వెసులుబాటు ఉంటుందని, ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం
చూపామని స్పష్టం చేశారు. రైతన్నలందరికీ చుక్కల భూములపై పూర్తి హక్కు
కల్పించామని, రైతన్నల కష్టం నేను చూశాను.. మీకు నేను ఉన్నాను.. ఇప్పటికే
గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేశామని, గతంలో అవనిగడ్డ నియోజక
వర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించామన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూసర్వే
వేగంగా జరుగుతోందని, ఇప్పటికే 2వేల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు.
భూ హక్కు పత్రాలు కూడా వేగంగా ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా
భూసర్వే చేస్తున్నామని, ఈ నెల 20న 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు పంపిణీ
చేస్తామని చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందుబాటులోకి
తెచ్చామని, దళారీ వ్యవస్థ లేకుండా చేసి రైతులకు మేలు చేశామని, గతంలో ఎన్నడూ
జరగని మంచి ఇప్పుడు రైతులకు జరుగుతుందని, నాలుగేళ్లుగా ప్రతి అడుగూ రైతన్నల
కోసమే వేశామని, రైతులను చంద్రబాబు గాలికొదిలేశారని, చంద్రబాబు, దత్తపుత్రుడు
రైతు బాంధవుల వేషం వేశారని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.
వందేళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ లేదా
ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ
సెటిల్మెంట్ రిజిస్టర్ – ఆర్ఎస్ఆర్) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి
వదిలేశారు. అవే చుక్కల భూములు. వీటిని రైతులు అనుభవిస్తున్నా, సంపూర్ణ హక్కులు
లేక దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం వీరి కష్టాలను
మరింత సంక్లిష్టం చేస్తూ అనాలోచితంగా ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో
చేర్చింది. దీంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వైఎస్
జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూములపై రైతులకే సంపూర్ణ హక్కులు
ఉండాలని నిర్ణయించారు. రైతులు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే
అవసరం లేకుండా, ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ఈ భూముల సమస్యకు శాశ్వత
పరిష్కారం చూపుతూ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. జిల్లా కలెక్టర్ల ద్వారా
చుక్కల భూములను పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుండి డీ నోటిఫై చేశారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ భూములపై రైతులకు సర్వ హక్కులు లభించాయి.
రైతన్నలకు ఇక నిశ్చింత…సర్వ హక్కులూ వారికే : కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి
ప్రతాప్‌కుమార్ రెడ్డి
ఎన్నో ఏళ్ళుగా చుక్కల భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతన్నల సమస్యను సీఎం
పరిష్కరించారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి అన్నారు.
సీఎం రైతుల పక్షపాతి, ఆయన తండ్రి బాటలో ముందుకెళుతూ, రైతాంగానికి
వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. నెల్లూరు జిల్లాలో 43 వేల ఎకరాల చుక్కల భూములు
ఉన్నాయని, వాటిని విముక్తి చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం రైతాంగానికి
ఉపయోగకరమన్నారు. పిల్లల చదువుల కోసం దేశంలో ఏ సీఎం చేయని విధంగా వేల కోట్లు
ఖర్చుపెట్టి స్కూల్స్ రూపురేఖలు మార్చారని, గడప గడపకు వెళుతున్న సమయంలో
ప్రతి ఇంటిలో ఏ విధంగా ఆదరిస్తున్నారో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.