ఎన్నికల పోరులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ కానుందా?
బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. కానీ, తాజాగా
వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏవీ కూడా.. ఏ పార్టీకి మెజార్టీని,
అధికారాన్ని కట్టబెట్టలేదు. కాకపోతే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా
అవతరిస్తుందని మాత్రమే దాదాపు చాలావరకు ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు వెల్లడించాయి.
విచిత్రంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో(ప్రధాన పార్టీలు
మారాయంతే) ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికాగా ఆ సమయంలో ఆ జోస్యమే ఫలించింది
కూడా. కర్ణాటక 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ 2023 ఎన్నికల తరహా ఎగ్జిట్
పోల్స్ వెల్లడి అయ్యాయి. అయితే అప్పుడు తుది ఫలితం కూడా అంచనాలకు తగ్గట్లే
వచ్చింది. ఆరు జాతీయ వార్తా సంస్థలతో పాటు ఓ రీజినల్ ఛానెల్ సర్వే కూడా
బీజేపీకే అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పాయి. చెప్పినట్లుగానే బీజేపీకి
అత్యధిక సీట్లు వచ్చాయి. అదే సమయంలో వేసిన హంగ్ అంచనా కూడా ఫలించింది. గత
ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ.
కానీ, ప్రభుత్వ ఏర్పాటు కోసం నాటకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
సీఎంగా ప్రమాణం చేసిన యాడ్యూరప్ప మూడు రోజులకే రాజీనామా చేశారు. ఆపై
కాంగ్రెస్, జేడీఎస్‌లు సర్కార్‌ను ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎంగా
బాధ్యతలు చేపట్టారు.
కానీ 14 నెలల తర్వాత బీజేపీలోకి కొందరు జంపింగ్ ఎమ్మెల్యేలతో సీన్ మారింది.
కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. కాషాయ పార్టీ బలం 116కు చేరి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు ఎగ్జిట్‌పోల్స్ మాదిరే ఇప్పుడు
గణాంకాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నాలుగైదు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో
కాంగ్రెస్ పైచేయి కనిపిస్తోంది. ఇక గత ఎగ్జిట్‌పోల్స్‌కి ఇప్పటి
ఎగ్జిట్‌పోల్స్‌కు ప్రధానంగా కనిపిస్తున్న మూడో సారుప్యత జేడీఎస్ పార్టీ. గత
ఎన్నికల్లో 20 నుంచి 40 స్థానాల నడుమ గెలుస్తుందని వేసిన అంచనా జేడీఎస్
విషయంలో నిజమైంది. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కింగ్‌మేకర్
అవుతుందని కూడా ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన జోస్యం ఫలించింది. ఇప్పుడు కూడా
ఎగ్జిట్‌పోల్స్ జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్ల దాకా రావొచ్చని అంచనా
వేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమయ్యే స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి
రాకపోవచ్చని భావిస్తున్న తరుణంలో జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ అయ్యే
అవకాశమూ లేకపోలేదు.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టం పోలింగ్
ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు. శనివారం ఏ పార్టీ భవితవ్యం ఏంటన్నది
తేలిపోతుంది. ఈలోగా ఓటర్‌నాడిని అంచనా వేస్తూ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు
పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ప్రధానంగా భావించిన మూడు పార్టీలలో ఏ పార్టీకి
స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టకుండా దాదాపు మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ హంగ్
సంకేతాలను అందించాయి. ఈలోపు రీజియన్ల వారీగా ఆ ఫలితాలను ఓసారి పరిశీలిస్తే
కోస్టల్ కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ రీజియన్‌లో
స్థానాలను మొత్తం బీజేపీ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కాంగ్రెస్
సింగిల్ డిజిట్‌కు పరిమితం కావొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో స్థానిక
జనతాదళ్ సెక్యులర్ ఇక్కడ ఎలాంటి ఖాతా తెరవకపోవచ్చనే ఎగ్జిట్‌పోల్స్ కోడై
కూస్తున్నాయి. ఈ రీజియన్‌లో ఓటింగ్ శాతంలోనూ.. బీజేపీ ఆధిక్యం కనబర్చవచ్చని
ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. సగానికి పైగా ఓట్ షేర్‌ను కాషాయం పార్టీ
దక్కించుకోనుంది. కాంగ్రెస్ కూడా దాదాపు 40 శాతం ఓట్ షేర్
దక్కించుకోవచ్చని, అదే సమయంలో జేడీఎస్ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం
కావొచ్చని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి.
ఇక రాజధాని బెంగళూరు రీజియన్‌లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ
కాంగ్రెస్ విజయదుంధుబి మోగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సగానికి
పైగా సీట్లతో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరుస్తుందని, సింగిల్ డిజిట్ నుంచి పది
స్థానాల దాకా బీజేపీ గెలవొచ్చనే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఓట్
షేరింగ్‌లో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 44 శాతం, కాషాయం పార్టీకి 40 శాతం,
జేడీఎస్ ఓట్ షేరింగ్ 15 శాతానికి ఉండొచ్చని అంచనా. ఈ రీజియన్‌లో మెల్కోటోలో
అత్యధికంగా 67.4 శాతం పోలింగ్ నమోదు కాగా సీవీ నగర్లో అత్యల్పంగా 32 శాతం
పోలింగ్ రికార్డు అయ్యింది. సెంట్రల్ కర్ణాటకలో ప్రధాన పార్టీలు
బీజేపీ-కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొందని ఎగ్జిట్‌పోల్స్
వెల్లడించాయి. 23 సీట్లున్న సెంట్రల్ కర్ణాటకలో సగం సగం సీట్లు గెలిచి ఇరు
పార్టీలు గట్టి పోటీ ఇవ్వొచ్చని ముక్తకంఠంతో ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. ఇక
జేడీఎస్ ఇక్కడ అసలు ఆధిపత్యం ప్రదర్శించకపోవచ్చని.. గెలిచినా ఒకటికి మించి
స్థానం కైవసం చేసుకోకపోవచ్చనే అంచనా నెలకొంది. హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌లో
కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఈ
రీజియన్‌లో 40కిగానూ.. 30 దాకా కాంగ్రెస్ సొంతం కావొచ్చని అంచనా వేశాయి. అదే
సమయంలో బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావొచ్చని పేర్కొన్నాయి. జేడీఎస్
ఇక్కడ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావొచ్చని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. అదే
సమయంలో ఓటు షేర్‌లోనూ 47 శాతం దాకా కాంగ్రెస్‌కే దక్కవచ్చని అంచనా వేశాయి. ఇక
కుమారస్వామి ఎంతగానో ఆశలుపెట్టుకున్న ఉత్తర కర్ణాటక, పాత మైసూర్ రీజియన్ల
ఓటర్లు సైతం జేడీఎస్ ఆశలకు గండికొట్టేలా కనిపిస్తున్నారు.