శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో ఎన్ ఆర్ ఐ లు పాల్గొనండి
ఏపీఎన్ఆర్ టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి
గుంటూరు : కెనడా, యు ఎస్ ఏ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం జూన్ 4వ
తేదీ నుండి జూలై 23 వ తేదీవరకు పద్నాలుగు నగరాలల్లో శ్రీ మలయప్ప స్వామి వారి
కళ్యాణములు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి
వెల్లడించారు. కెనడా, యు ఎస్ ఏ దేశాలలో “శ్రీనివాస కళ్యాణోత్సవం”
పోస్టర్లను టీటీడీ అధ్యక్షులు వై.వి. సుబ్బారెడ్డి, ఏపీఎన్ఆర్ టీఎస్
అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి, టూరిజం అధ్యక్షులు వరప్రసాద్, స్త్రీ, శిశు
సంక్షేమ అభివృద్ధి సలహాదారు పద్మజ, కాపు కార్పోరేషన్ అధ్యక్షులు అడపా శేషు,
ఇతర కార్పోరేషన్ల డైరెక్టర్లు టిటిడి చైర్మన్ తాడేపల్లి కార్యాలయంలో
ఆవిష్కరించారు. అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్ర, దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణములు
నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా జూన్, జూలై, అక్టోబర్,
నవంబర్ 2022 నెలల్లో యు ఎస్ ఏ, యు కే, యూరోప్ లలోని 20 నగరాల్లో అత్యంత
వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణాలు ఆయా దేశాలలోని తెలుగు
అసోసియేషన్ల, ధార్మిక సంస్థల సహకారంతో నిర్వహించామన్నారు. గత నెల 28వ తేదీన
బహ్రెయిన్ లో నిర్వహించిన కళ్యాణోత్సవానికి దాదాపు 15 వేలమందికి పైగా భక్తులు
స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారన్నారు. కెనడా , యు ఎస్ ఏ లలోని పలు
తెలుగు అసోసియేషన్లు, ధార్మిక, సేవా సంస్థల కోరిక మేరకు ఆయా దేశాలలోని
భక్తులకోసం టీటీడీ శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్ టీఎస్ ఆయా నగరాల్లోని
కార్యనిర్వాహకులతో సమన్వయము చేస్తోందన్నారు.
టీటీడీ నియమాల ప్రకారం శ్రీవారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని, తిరుమల
శ్రీవారి దేవస్థానం నుండి వెళ్ళే అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం
శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమం
మొదలవుతుందన్నారు. తిరుమలలో లాగానే శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించడం
జరుగుతుంది. ఆయా నగరాల్లో తెలుగు, భారతీయ అసోసియేషన్లు లడ్డూ ప్రసాదాలతో
పాటు, భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారన్నారు. ఉచితంగా
శ్రీవారి కళ్యాణోత్సవం తిలకించడానికి అందరూ ఆహ్వానితులే. భక్తులందరూ స్వామి
వారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, ఆ దేవదేవుడి ఆశీర్వాదాలు
పొందాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున
నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని తితిదే ఛైర్మన్
వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఏపీఎన్ఆర్ టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ కెనడా, యు
ఎస్ ఏ దేశాలలో దేవదేవుడైన శ్రీవారి కళ్యాణాలు నిర్వహించడానికి ఆయా నగరాల
కార్యనిర్వాహక వర్గంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అక్కడ ఏర్పాట్లను,
వారికి కావలసిన సామాగ్రి విషయంలో ఇటు తితిదే అర్చకులు, వేదపండితులతో సమన్వయం
చేస్తున్నామన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ
వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో ఎన్ ఆర్ ఐ లు పాల్గొని, ఆ దేవదేవుడి
కృపకు పాత్రులు కావాలని కోరారు.