జగనన్న కాలనీలో పక్కాగృహాల నిర్మాణాలకు శంకుస్థాపనలు
శంకుస్థాపనలు చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
ఎన్టీఆర్ జిల్లా : మూడున్నర దశాబ్దాల సమస్యకు మోక్షం కలిగింది. పేద ప్రజల
ఇళ్లస్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. జి.కొండూరులో వైఎస్సార్
జగనన్న కాలనీలో పేదల ఇళ్ల నిర్మాణాలకు మలిఅడుగు పడింది. పేదోళ్ల చిరకాల
స్వప్నమైన సొంతింటి నిర్మాణం సాకారం కానుంది. విజయవాడ – ఛత్తీస్ ఘడ్ జాతీయ
రహదారికి సమీపంలో ఎంతో విలువైన భూమిని పేదల కోసం కొనుగోలు చేసి మైలవరం
శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తొలి అడుగు వేయగా, తాజాగా ఆ
భూమిని జగనన్న కాలనీగా అభివృద్ధి చేయించి, అందులో పేదల పక్కాగృహాల నిర్మాణాలకు
శంకుస్థాపనలు చేసి మలిఅడుగు వేశారు. జి.కొండూరులో గురువారం కన్నులపండువగా
జరిగిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు అనే పథకం కింద నిర్వహించిన పక్కాగృహాల
నిర్మాణాలకు శాసనసభ్యులు కృష్ణప్రసాదు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
గారు ముఖ్యఅతిథులుగా హాజరై శంకుస్థాపనలు చేశారు. జగనన్న కాలనీల పేరుతో ఊళ్లకు
ఊళ్లే నిర్మించి రాష్ట్రప్రభుత్వం పేదల పక్షపాతి అని నిరూపించుకుంటోందని
శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ జగనన్న
పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన అందరికీ ఇళ్లస్థలాలు, ఇళ్ళు మంజూరు
చేస్తున్నట్లు వెల్లడించారు. ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యే కొద్దీ విద్యుత్,
డ్రైనేజీ, నీటి సౌకర్యం పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని
వెల్లడించారు. సొంతిల్లు లేక అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఆర్థిక ఇబ్బందులు
ఎదుర్కొంటున్న ఎంతో మంది అక్కచెల్లెమ్మల మోములో సంతోషం చూసేందుకే జగనన్న
కాలనీలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా జి.కొండూరులో అర్హతలు ఉన్న
వారందరికీ ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు. అభివృద్ధికి, పేదల ఆత్మగౌరవానికి
సూచీలుగా జగనన్న కాలనీలు నిలుస్తున్నాయి. మహిళల సాధికారతకు శాశ్వత చిరునామాలు
వైఎస్సార్ జగనన్న కాలనీలు అని పేర్కొన్నారు. స్త్రీ ఆలోచనలకు అనుగుణంగా
కుటుంబాలు ముందుకు నడిస్తే వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగ్గా ఉంటాయనే భావనతో
రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు మహిళల పేరుతోనే ఇచ్చినట్లు
వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో 20 వేల మందికి పైగా ఇళ్లపట్టాలు మంజూరు
చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయాన్ని సద్వినియోగం
చేసుకుని త్వరగా ఇళ్లనిర్మాణాలు పూర్తి చేయాలని వారికి సూచించారు. జి.కొండూరు
గ్రామంలో 376 మందికి పైగా ఇళ్లస్థలాలు మంజూరు చేశామన్నారు. ఇక్కడ ఐదేళ్లు
ఎమ్మెల్యేగా మరో ఐదేళ్లు మంత్రిగా పని చేసిన వ్యక్తి ఎక్కడైనా భూమిని కొని
పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చాడా? అని ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం అతను ఏదో
రకంగా అలజడి సృష్టిస్తున్నాడని విమర్శించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ,
సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. పేదలకు ప్రతిపక్షాలు
మంచి చేయకపోగా, తమ ప్రభుత్వం మంచి చేస్తుంటే చూడలేక పోతున్నాయన్నారు. ప్రజలు
అన్ని విషయాలు గుర్తుంచుకోవాలన్నారు. జి.కొండూరు మండలంలోని కట్టుబడిపాలెం,
చెవుటూరు, గుర్రాజుపాలెం, వెంకటాపురం గ్రామాల్లో కూడా ఇళ్లస్థలాల సమస్య ఉందని,
ఆయా గ్రామాల్లో కూడా అర్హులకు ఇళ్లస్థలాలు మంజూరు చేస్తామన్నారు. ఈ
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.