అపర సంజీవని ఆరోగ్యశ్రీ పధకం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
విజయవాడ : వైద్య, ఆరోగ్య రంగం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
చిత్తశుద్ధితో పనుచేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని
పేర్కొన్నారు. మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు కల్పించేందుకు నిత్యం
తపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు గొప్ప సేవలు
అందిస్తున్నారని అన్నారు. మరింత మెరుగైన సేవలను అందించాలనే ఉద్ధేశంతోనే రెండు
రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
కోవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనవని ప్రశంసించారు. ఈ మేరకు
బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలోమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల
సేవలు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయని మంత్రి పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీలో అందించే చికిత్సలను పెంచామని, 3255 వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో
చేర్చారని, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. గతంలో
ఎన్నడూ జరగనంతగా వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే
49వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. వైద్యానికి కావాల్సిన బడ్జెట్
పెంచాం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.
‘సీఎం జగన్ మనసున్న ముఖ్యమంత్రి. ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించడం వల్ల
ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. మెడికల్ కాలేజీలు తేవాలంటే చాలా ధైర్యం
కావాలి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి జగన్ మోహన్ రెడ్డి చరిత్ర
సృష్టించారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ
ఉండాలన్నదే సీఎం ఆశయం. భావితరాలకు మెరుగైన వైద్యం అందించడం కోసం సీఎం ఒక యజ్ఞం
చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఇప్పటికే కొంత మేర చెల్లించాం.
త్వరలోనే మిగతా వాటిని కూడా చెల్లిస్తాం. నాణ్యమైన వైద్యం అందించే విషయంలో
ప్రభుత్వం రాజీ పడదని మంత్రి పేర్కొన్నారు.
అపర సంజీవని ఆరోగ్యశ్రీ : రాష్ట్రంలోని పేద ప్రజలకు డాక్టర్ వైఎస్సార్
ఆరోగ్యశ్రీ పథకం అపర సంజీవనిలా మారిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
అన్నారు. ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు తదితర అంశాలపై మంత్రి విడదల రజిని
మంగళగిరిలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఆరోగ్యశ్రీ పథకం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.3,336 కోట్లు
కేటాయించిందని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం 1,059 ప్రొసీజర్లకు మాత్రమే ఈ
పథకం వర్తింపజేసిందని, తమ ప్రభుత్వం కొత్తగా మరో 2,446 ప్రొసీజర్లను
చేర్చిందని చెప్పారు. దీంతో ఏకంగా 3,255 ప్రొసీజర్లకు వైద్యం ఉచితంగా ప్రజలకు
అందుతోందన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి రూ.వెయ్యి కోట్ల వరకు
మాత్రమే ఖర్చు చేసేదన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం రూ.3వేల కోట్లకు
పైగా ఖర్చు చేస్తోందన్నారు. అదేవిధంగా ఆరోగ్య ఆసరా కోసం రూ.445 కోట్లు, 108
వాహనాల నిర్వహణకు రూ.187 కోట్లు, 104 వాహనాల నిర్వహణకు రూ.164 కోట్లు,
ఈహెచ్ఎస్ కోసం రూ.140 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని వివరించారు. ఏపీలో
2,061ఆస్పత్రులు, తెలంగాణలో 132, కర్ణాటకలో 49, తమిళనాడులో 22 ఆస్పత్రుల్లో
ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఆరోగ్యశ్రీ సీఈవో
హరేంధిరప్రసాద్, అడిషనల్ సీఈవో మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.