కడప : తొమ్మిది సంవత్సరాలైనా కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని
తెలంగాణ నుంచి ఏపీకి తరలించకపోవడం దురదృష్టకరమని మాజీ రాజ్యసభ సభ్యులు,
ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం
మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యాలయాన్ని రాయలసీమలో కాకుండా విజయవాడలో పెట్టాలని
టీడీపీ, విశాఖలో పెట్టాలని వైసీపీ పార్టీ బోర్డుకు లేఖలు రాయడం శోచనీయమన్నారు.
హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు 17వ సమావేశం జరుగుతోందని
తెలిపారు. ఈ సమావేశంలో అయినా బోర్డు కార్యాలయాన్ని హైదారాబాద్ నుంచి
కర్నూల్‌కు తరలించే నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్
చేస్తోందన్నారు. జగనన్నకు చెబుదాం ఒక దండగమారి కార్యక్రమమని విరుచుకుపడ్డారు.
‘‘స్పందనకు డూప్లికేటే జగనన్నకు చెబుదాం. స్పందనకే స్పందన లేదు. మరి జగనన్నకు
చెబుదాం ఎందుకో?’’ అని విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు చెప్పిన వాటికే
దిక్కు లేదు. మళ్లీ చెప్పి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. జగన్‌ను దించుదాం
అనే ఖచ్చితమైన నిర్ణయానికి ప్రజలు ఇప్పటికే వచ్చారని, ఎన్ని జిమ్మిక్కులు
చేసినా ప్రయోజనం లేదని తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.