*ఓటేసిన సినీనటుడు ప్రకాశ్ రాజ్
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల
నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. గత 40 రోజులుగా
కొనసాగిన హోరాహోరీ ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియగా.. మంగళవారం
అభ్యర్థులంతా ఇంటింటి ప్రచారానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 224
స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) ప్రధానంగా
పోటీపడుతున్నాయి. అన్ని పార్టీలు, స్వతంత్రులతో కలిపి మొత్తం 2,165 మంది
అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 72.36 శాతం
పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకు మించి పోలింగ్ నమోదు చేసేందుకు ఎన్నికల
కమిషన్ కసరత్తు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5.31 కోట్ల మంది ఓటు వేసేందుకు
ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం
పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఆలయాలకు వెళ్లిన బసవరాజ బొమ్మై, యడియూరప్ప
పోలింగ్‌లో పాల్గొనే ముందు సీఎం బసవరాజ బొమ్మై, యడియూరప్ప ఆలయాలకు వెళ్లారు.
అక్కడ మొక్కులు చెల్లించుకున్న అనంతరం పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు
హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన సినీనటుడు ప్రకాశ్ రాజ్
సినీనటుడు ప్రకాశ్ రాజ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారు.
బెంగళూరులోని శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన సెయింట్ జోసెఫ్ స్కూల్ పోలింగ్
బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ బూత్‌లో పెళ్లికూతురు : నవ యువ ఓటర్లలో ఓ యువతి స్ఫూర్తి నింపే
ప్రయత్నం చేసింది. తన పెళ్లి రోజైనా సరే వధువుగా ముస్తాబై పోలింగ్ బూత్‌కు
వచ్చింది. ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటేసింది. ఎన్నికల అధికారులు ఆమెను
అభినందించారు.
కర్ణాటక ఎన్నికల్లో జప్తులు రూ.375 కోట్లు : కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఆ
రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు నగదు, వస్తువుల రూపంలో రూ.375.61
కోట్ల మేర జప్తులు చేసింది. ఇందులో రూ.147.46 కోట్ల నగదు, రూ.83.66 కోట్ల
విలువ చేసే 22 లక్షల లీటర్ల మద్యం, రూ.23.67 కోట్ల మాదకద్రవ్యాలు, రూ.96.60
కోట్ల లోహాలు, రూ.24.21 కోట్ల తాయిలాలు ఉన్నాయి.