సంస్థలు, సీట్ల సంఖ్యను పెంచిన కేంద్రం
మహిళలకు 20 శాతం కోటా
*అమరావతి : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయస్థాయి విద్యాసంస్థలలో సీట్ల
సంఖ్య భారీగా పెరగడంతో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యావకాశాలు మరింత
మెరుగవుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, ఎన్ఐటీ,
ఐఐఐటీలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జీఎఫ్టీఐలలో 56,900ల వరకు
సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ
(జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన
ప్రాథమిక కసరత్తును చేపట్టింది. జూన్ 19 నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల భర్తీ
ప్రక్రియను చేపట్టనుంది.
ఐదేళ్లలో 18వేలకు పైగా పెరిగిన సీట్లు : గడచిన ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్ఐటీలు,
ఐఐఐటీల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం
విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, యువతకు ఉపాధి మార్గాలు అత్యధికంగా అందులోనే
లభిస్తుండడం వంటి కారణాలతో సాంకేతిక విద్యకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
2019కు ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండడంతో ఉన్నత
ప్రమాణాలుగల సాంకేతిక నిపుణుల అందుబాటూ అంతంతమాత్రంగానే ఉండేది. ఈ విద్యకోసం
ఏటా దాదాపు 8లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలకు వెళ్లేవారు. ఇందుకు
లక్షలాది రూపాయలను వారు వెచ్చించాల్సి వచ్చేది. దీన్ని నివారించి దేశంలోనే
అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను వారికి అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం
చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. 2024 నాటికి ఐఐటీ తదితర జాతీయ
విద్యాసంస్థల సంఖ్యను పెంచడంతో పాటు సీట్ల సంఖ్యను 50% మేర పెంచేలా చర్యలు
తీసుకుంది. అలాగే, 20 ప్రముఖ ఐఐటీ, ఇతర సంస్థలను ఇని స్టిట్యూట్స్ ఆఫ్
ఎమినెన్సు (ఐఓఈ)లుగా తీర్చిదిద్ది అత్య«దిక నిధులు కేటాయించింది.
సంస్థలు, సీట్ల సంఖ్యను పెంచిన కేంద్రం : ఇదిలా ఉండగా డీపీ సింగ్ ఇచ్చిన
నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఐఐటీలు, ఎన్ఐటీలు ఇతర సంస్థలు, సీట్ల సంఖ్యను
2020లో ఒక్కసారిగా పెంచింది. 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో,
జీఎఫ్టీఐలలో 38,704 సీట్లు ఉండగా దాన్ని 2020లో ఒకేసారి 50,822కు పెంచింది.
వివిధ రాష్ట్రాల్లో కొత్త విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు అప్పటికే ఉన్న ఐఐటీ,
ఎన్ఐటీల్లో సదుపాయాలను మెరుగుపరచి సీట్ల సంఖ్యను పెంచింది. ఆ తరువాత కూడా
ఏటేటా అయా సంస్థల్లో రెండేసి వేల చొప్పున సీట్లను పెంచుకునేలా చేసింది. 2021లో
52,453 సీట్లు, 2022లో 54,477 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2024 నాటికి 50
శాతం మేర సీట్లు పెంచాలన్న లక్ష్యం మేరకు 2023–24లో కూడా సీట్ల సంఖ్య పెరిగి
56,900 వరకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఈసారీ జోసా కటాఫ్ స్కోర్ : ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల
ప్రక్రియను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) చేపడుతుంది. జేఈఈ మెయిన్,
అడ్వాన్సుడ్‌లో అత్యధిక స్కోరుతో మెరిట్ ర్యాంకులు సాధించిన వారికి వీటిల్లో
ప్రవేశాలు కల్పిస్తారు. 2023 ప్రవేశాలకు సంబంధించి జేఈఈ మెయిన్ పరీక్షలను
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జనవరి, ఏప్రిల్ నెలల్లో పూర్తిచేసి ఇటీవల తుది
ర్యాంకులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మెయిన్‌లో అర్హత సాధించిన టాప్
2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సుడ్‌ను నిర్వహించనున్నారు. అడ్వాన్సుడ్
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ
దరఖాస్తులను మే 7 వరకు స్వీకరిస్తారు. జూన్ 4న జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష
జరుగుతుంది. ఈ ఫలితాలు జూన్ 18న విడుదలవుతాయి. అనంతరం జూన్ 19 నుంచి జోసా
రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే ఆరు విడతలుగా
కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు
జోసా కటాఫ్ ర్యాంకులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మహిళలకు 20 శాతం కోటా : ఇక ఐఐటీల్లో మహిళల చేరికలు నామమాత్రంగా ఉండడంతో వారి
సంఖ్యను పెంచేందుకు వీలుగా అన్ని ఐఐటీల్లో 2018–19 నుంచి 20% మేర అదనపు కోటాను
పెంచి సూపర్ న్యూమరరీ సీట్లను కేంద్రం ఏర్పాటుచేయించింది. మూడేళ్లపాటు దీన్ని
తప్పనిసరిగా అన్ని సంస్థల్లో కేంద్రం కొనసాగించింది. దీంతో 2021 నాటికే ప్రముఖ
ఐఐటీల్లో మహిళల చేరికలు 20 శాతానికి పైగా పెరిగాయి. తరువాత మహిళలకు సూపర్
న్యూమరరీ సీట్లపై ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా చేసింది.