పుణె : మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రాచీ దహబల్ దేబ్ అనే మహిళ కేకులతో
అద్భుతమైన ఆకృతులను రూపొందిస్తూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు.
తాజాగా రాయల్ ఐసింగ్ విధానంలో ఆమె తయారు చేసిన 200 కిలోల భారతీయ రాజభవనం
నమూనా కేకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. వీగన్
రాయల్ ఐసింగ్లో ఆరితేరిన ప్రాచీ పుణెలోని పింప్రి చించ్వాడ్లో నివాసం
ఉంటున్నారు. గతంలో మిలాన్ కేథడ్రల్ నమూనాలో 100 కిలోల కేకును రూపొందించి ఆమె
రికార్డును నెలకొల్పారు. అత్యధిక వీగన్ రాయల్ ఐసింగ్ ఆకృతులను రూపొందించిన
ప్రపంచ రికార్డు కూడా ఆమె పేరు మీదే ఉంది. బ్రిటన్ రాజకుటుంబం కోసం తయారు
చేసే కేకులను అలంకరించడానికి రాయల్ ఐసింగ్ను ఉపయోగిస్తారు. ఇది
ప్రతిష్ఠాత్మకమైన కళ. 11 ఏళ్ల క్రితం కేకు ఆర్టిస్ట్‌గా జీవితం ప్రారంభించిన
ఆమె రాయల్ ఐసింగ్ గురించి తెలుసుకుని లండన్‌లో ఈ కళను నేర్చుకున్నారు.