లండన్ : అంతర్జాతీయ నర్సింగ్ అవార్డు కోసం తుది పరిశీలనలో ఉన్న పది మంది
అభ్యర్థుల్లో భారత సంతతికి చెందిన నర్సులు ఇద్దరు ఉన్నారు. ఈ 10 మందిలో అంతిమ
విజేతకు లండన్‌లో మే 12న ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ సందర్భంగా అవార్డు,
2,50,000 డాలర్ల నగదు (రూ.2.05 కోట్లు) బహూకరిస్తారు. దుబాయ్ ప్రధాన
కార్యాలయంగా భారత్, గల్ఫ్ దేశాల్లో ఆరోగ్య సేవలను అందిస్తున్న ప్రైవేటు
సంస్థ ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. భారతీయుడు
డాక్టర్ ఆజాద్ మూపెన్ స్థాపించిన సంస్థ ఇది. ఫైనలిస్టుల జాబితాలోని నర్సు
శాంతి థెరెసా లక్రా ఇప్పటికే పద్మశ్రీ అవార్డు పొంది ఉన్నారు.
పోర్ట్బ్లయర్లోని జీబీ పంత్ ఆస్పత్రిలో పనిచేసే శాంతి థెరెసా అండమాన్,
నికోబార్ దీవుల్లోని గిరిజనులకు ఆరోగ్యసేవలు అందిస్తారు. 2004లో సునామీ
వచ్చినపుడు ఓంగీ ద్వీప గిరిజనులు తీరం వదలి అడవి లోతట్టు ప్రాంతానికి
తరలిపోయారు. శాంతి గుడారం వేసుకొని వారితో కలిసి జీవిస్తూ ఆరోగ్యసేవలు
అందించారు. పైనలిస్టుల జాబితాలోని రెండో భారత సంతతి నర్సు జిన్సీ జెర్రీ
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని మేటర్ మిసరికార్డియా విశ్వవిద్యాలయ
ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. రోగికి సంబంధించిన ప్రయోగశాల ఫలితాలను రోగ
నిర్ధారణకు, చికిత్సకు ఉపయోగించే సమయంలో పొరపాట్లకు తావు లేకుండా చేసే
సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినందుకు ఈమె పైనలిస్టుల జాబితాలో చేరారు. ఈ జాబితాలో
ఇంకా బ్రిటన్, ఐర్లాండ్, యూఏఈ, కెన్యా, టాంజానియా, పనామా, సింగపూర్,
పోర్చుగల్, ఫిలిప్పీన్స్ దేశాల నర్సులూ ఉన్నారు.