రష్యా అధ్యక్షుడు వ్లాదిమి పుతిన్
మాస్కో: ప్రస్తుతం ప్రపంచం కీలక మలుపులో ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్
పుతిన్ చెప్పారు. తమపై పాశ్చాత్య దేశాలు నిజమైన యుద్ధం చేస్తున్నాయని
ఆరోపించారు. విక్టరీ డే సందర్భంగా మాస్కోలోని రెడ్‌స్క్వేర్ వద్ద జరిగిన
సైనిక కవాతులో ఆయన పాల్గొని ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై
సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విజయోత్సవాన్ని రష్యా ఘనంగా నిర్వహిస్తుంది.
పాశ్చాత్య దేశాల నుంచి ముప్పును ఎదుర్కొనేందుకే ఉక్రెయిన్‌పై సైనిక చర్య
చేపట్టాల్సి వచ్చిందని పలుమార్లు స్పష్టంచేసిన పుతిన్ ఇప్పుడు మరోసారి ఆ
దేశాలను తప్పుపట్టారు. ఈ యుద్ధంలో రష్యా విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
‘డాన్బాస్ ప్రాంత ప్రజలకు రక్షణ కల్పిస్తాం. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో
భాగమైనందుకు గర్వంగా ఉంది’ అని అన్నారు. హుర్రే.. అంటూ కవాతులో పాల్గొన్న
సైనికులను ఉత్సాహపరిచారు. వారి సేవల్ని కొనియాడుతూ- ప్రజలు సంఘీభావంగా
నిలవాలని కోరారు.
తగ్గిన సందడి : విక్టరీ డే కవాతులో గతసారి కంటే ఈసారి సైనికుల సంఖ్య తగ్గింది.
విమానాల విన్యాసాలు లేవు. గంటలోపే కార్యక్రమం ముగిసింది. రెండో ప్రపంచ
యుద్ధంలో పనిచేసిన, చనిపోయినవారి బంధువులు నిర్వహించే ప్రదర్శన ఈసారి
రద్దయింది. 21 నగరాలు ఈ ఉత్సవాలను రద్దు చేసుకున్నాయి. ఉక్రెయిన్‌పై పోరాటంలో
చనిపోయినవారు కూడా దీనిలో చేరవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేశారని భావిస్తున్నారు.
క్రెమ్లిన్‌పై ఇటీవల డ్రోన్ల దాడికి ప్రయత్నం జరిగిన నేపథ్యంలో ఈ పరిణామాలు
చర్చనీయాంశమయ్యాయి. ‘విక్టరీ డే’ ముందు ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది.
డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ఇందులో నలుగురు పౌరులు మృతి చెందారు.
తమపైకి వచ్చిన 25లో 23 క్షిపణుల్ని నాశనం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది.