గత ప్రభుత్వంలో కేవలం 1059 చికిత్సలకే ఆరోగ్యశ్రీ
ఇప్పడు ఏకంగా 3255 చికిత్సలకు ఉచితంగా వైద్యం
2263 ఆస్పత్రుల్లో సేవలు
ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఆస్పత్రుల తీరు అభినందనీయం
మరింత వేగంగా ఈహెచ్ ఎస్ సేవలు అందాలి
104 కాల్ సెంటర్ ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉండండి
108 వాహనం కోసం ఫోన్ చేస్తే.. వెహికిల్ లొకేషన్ తో సహా వివరాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
ఆరోగ్యశ్రీ పై పూర్తి స్థాయి సమీక్ష సమావేశం
మంగళగిరి : రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ పథకం అపరసంజీవనిలా
పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరు, 104, 108 వాహనాలు, ఆరోగ్య ఆసరా తదితరాలపై
మంత్రి విడదల రజిని సంబధిత శాఖ అధికారులతో మంగళవారం మంగళగిరిలోని
ఏపీఐఐసీ టవర్స్‌లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ కేంద్ర కార్యాలయంలో ఉన్నతస్థాయి
సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని
మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.3336
కోట్లు కేటాయించిందని గత ప్రభుత్వంలో కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే
ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందాయని తెలిపారు. జగనన్న ప్రభుత్వం
అధికారంలోకి వచ్చని వెంటనే ఈ సంఖ్యను 2446కు పెంచామని వెల్లడించారు.
మళ్లీ జగనన్న ఈ సంఖ్యను ఏకంగా 3255కు పెంచారని పేర్కొన్నారు. గతంలో
ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాదికి రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చయ్యేదని, ఇప్పుడు
ఏకంగా ఏడాదికి ఆరోగ్యశ్రీకి రూ.3వేల కోట్ల వరకు ఖర్చవుతోందని
వెల్లడించారు. ఆసరా కోసం రూ.445 కోట్లు, 108 వాహనాల నిర్వహణ కోసం రూ.187
కోట్లు, 104 వాహనాల నిర్వహణ కోసం రూ.164 కోట్లు, ఈహెచ్ ఎస్ కోసం రూ.140
కోట్లు ఈ ఏడాది బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. ఇదంతా
జగనన్న మంచి మనసు వల్లనే సాధ్యమైందని చెప్పారు.
2263 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు
మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఏకంగా 2263
ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని వెల్లడించారు. ఏపీలో
2061ఆస్పత్రులు, తెలంగాణలో 132, కర్నాటకలో 49, తమిళనాడులో 22
ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ స్థాయిలో
ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్న రాష్ట్రాలు మన దేశంలో ఎక్కడా లేవని
చెప్పారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందే విషయంలోగాని, 104, 108 వాహనాల
పనితీరులో సమస్యలకు సంబంధించిగాని తమ ప్రభుత్వం ఫిర్యాదుల కోసం 104
కాల్ సెంటర్‌ను తీసుకొచ్చిందని వివరించారు. ఈ కాల్ సెంటర్ ద్వారా
వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, అవసరమైతే కఠిన చర్యలు
తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ హెచ్ ఎస్ ద్వారా
ఆరోగ్య సేవలు, నగదు చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని
పేర్కొన్నారు. ఇప్పటికే ఈహెచ్ ఎస్ విషయంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సత్వరమే
స్పందిస్తున్నదని చెప్పారు. 108 వాహనానికి ఎవరైనా ఫోన్ చేస్తే… ఆ వాహనం
లొకేషన్ తో సహా ఫోన్ నంబరుకు లింక్ వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు.
ఇప్పుడు 108 వాహనం ఎప్పుడు వస్తున్నదో, ఏ ప్రాంతంలో ఉన్నదో కూడా
బాధితులకు వారి ఫోన్ లో తెలిసిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో
ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, అడిషనల్ సీఈవో మధుసూదన్‌రెడ్డి,
ఆరోగ్య శ్రీ విభాగ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.