దేశ అభివృద్ధికి కర్ణాటక ప్రజల సహకారం అవసరం
ప్రతి ఒక్కరూ రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
కన్నడ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ లేఖ
న్యూఢిల్లీ : బుధవారం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని
మోదీ అక్కడి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అలాగే రేపు అంతా ఓటు హక్కు
వినియోగించుకోవాలని కోరారు. కర్ణాటక లో బుధవారం పార్టీల భవిష్యత్తు తేలనుంది.
బుధవారం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు అధికారాన్ని
చేజిక్కించుకోనున్నారో ఓటర్లు నిర్ణయించనున్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర
మోడీకన్నడ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేశ అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రజల సహకారం
ఎంతో అవసరమని అందులో పేర్కొన్నారు. ‘మీరు ఎప్పుడూ నాపై ఎంతో ప్రేమ
కురిపించారు. ఈ అమృత కాలంలో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని
లక్ష్యంగా పెటుకున్నాం. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మన
లక్ష్యం మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మార్చడమే. ఇది సాధించాలంటే కర్ణాటక
వేగంగా అభివృద్ధి చెందాలి. ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి.
కరోనా సమయంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏటా 90వేల కోట్ల రూపాయల
విదేశీ పెట్టుడులను పొందింది. గత ప్రభుత్వ హయాంలో ఆ మొత్తం రూ.30వేల కోట్లుగా
ఉంది. మేం పెట్టుబడుల విషయంలో కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా
మార్చాలనుకుంటున్నాం’ అని నరేంద్ర మోడీ వెల్లడించారు. అలాగే ఈ రాష్ట్రంలోని
ప్రతి ఒక్క పౌరుడి కల..ఇకనుంచి తన కలగా మారుతుందని చెప్పారు. అంతేగాకుండా ఒక
వీడియోను విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని
అందులో అభ్యర్థించారు. 224 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఫలితాలు మే 13న విడుదల కానున్నాయి.