*హాజరైన ప్రియాంక గాంధీ
జై బోలో తెలంగాణ అంటూ ప్రసంగం*
అమరవీరుల త్యాగాలను తెలుగులో కొనియాడిన ప్రియాంక
యూత్ డిక్లరేషన్ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ : హైదరాబాదులోని సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ యువ
సంఘర్షణ సభకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ
సందర్భంగా, జై బోలో తెలంగాణ అంటూ ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ప్రేమాభిమానాలతో స్వాగతం పలికిన అందరికీ ధన్యవాదాలు. ఎండలు మండిపోతున్నా సభకు
భారీగా తరలివచ్చారు అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేశాడని, తెలంగాణ కలను సాకారం
చేసుకునేందుకు ప్రాణాలను కూడా లెక్కచేయలేదని ప్రియాంక గాంధీ కీర్తించారు. ఈ
సందర్భంగా ఆమె మిత్రులారా అంటూ తెలుగులో ప్రసంగించే ప్రయత్నం చేశారు. తెలంగాణ
సాకారం చేసుకునే క్రమంలో అమరవీరులు, విద్యార్థుల త్యాగాలు ఎనలేనివని అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇక్కడివారు ఉద్యమించారని తెలిపారు. ఈ సభలో
ప్రియాంక కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పోస్టర్ ను
ఆవిష్కరించారు.
ప్రియాంక గాంధీ ప్రసంగం ముఖ్యాంశాలు
యువత బలిదానాల వల్లే తెలంగాణ స్వప్నం సాధ్యమైంది. దేశం కోసం నా కుటుంబ సభ్యులు
కూడా ప్రాణత్యాగాలు చేశారు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అమరులయ్యారు.
సోనియా గాంధీని ఇక్కడి ప్రజలు తెలంగాణ తల్లిగా భావిస్తున్నారు. తెలంగాణ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం చాలా కఠినమైంది. తెలంగాణ ఏర్పాటు కోసం
సోనియా గాంధీ ఎంతో కసరత్తు, ఎంతో మథనం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు
నెరవేర్చాలన్న తపన సోనియా గాంధీకి ఉంది. జాగీర్దార్ల రీతిలో బీఆర్ఎస్ పాలన
కొనసాగుతోంది. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ ఇచ్చారా?
తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు
నెరవేర్చే ప్రభుత్వం కాదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన టీఎస్
పీఎస్సీలో ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన
అటకెక్కించారు… నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు.
రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఏర్పాటు కావడంలేదు కానీ, ప్రైవేటు
యూనివర్సిటీల ఏర్పాటుతో విద్యార్థులను దోచుకుంటున్నారు.
ఇందిరా గాంధీ చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆమెను స్మరిస్తున్నారు.
నేను సరికొత్త ఇందిరా గాంధీలా ఆమె ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తాను.
తెలంగాణ ప్రజలు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం
తీసుకోవాలి. ఎన్నికల వేళ విజ్ఞతతో వ్యవహరించకపోతే అంతిమంగా నష్టపోయేది ప్రజలే.
ఈ సభ ద్వారా యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నాం.
మేం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చుతాం. హామీలు
నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని పక్కనబెట్టండి.
ఉద్యోగ నియామకాల కోసం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.
నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి అందిస్తాం.
యువతీయువకుల కోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తాం.