సత్యనారాయణ
రూ.2 కోట్ల అంచనాతో గరివిడి – బొప్పడాం రోడ్డు పనులకు శంకుస్థాపన
ప్రజలు కష్టాలు చెప్పుకునేందుకు జగనన్నకు చెబుదాం ఓ చక్కని వేదిక అని
వ్యాఖ్య
విజయనగరం : పేద ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు
చేపడుతూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అటు అభివృద్ధికి, ఇటు సంక్షేమానికి
చిరునామాగా నిలుస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
పేర్కొన్నారు. ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి వారికేం కావాలో అవి
అందజేస్తున్నామని గుర్తు చేశారు. గరివిడి మండలంలోని దువ్వాం గ్రామంలో
సోమవారం చేపట్టిన గడప గడపకు – మన ప్రభుత్వం, రోడ్డు పనులకు
శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముందుగా
రూ.2 కోట్ల అంచనాతో నిర్మించనున్న గరివిడి – బొప్పడాం రోడ్డు పనులకు
మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో సేరిపేట, దువ్వాం గ్రామాలకు
అంతర్గత రోడ్ల నిమిత్తం మరొక రూ.20 లక్షలు కేటాయిస్తూ ప్రకటన చేశారు.
దువ్వాంలో ఏర్పాటు చేసిన గడప గడపకు – మన ప్రభుత్వం కార్యక్రమంలో
మంత్రి బొత్స పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
సంక్షేమ పథకాలపై, చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలను ఆరా తీశారు.
సేవల అందుతున్న తీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
సచివాలయ సిబ్బందిని వేదిక ముందుకు పిలిచి వారు అందిస్తున్న సేవల గురించి
ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి కొన్ని
విజ్ఞప్తులు రాగా మంత్రి స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని
సంబంధిత అధికారులను ఆదేశించారు. స్మశాన వాటిక నిమిత్తం పంట భూములు
పోతున్నాయని కొందరు మంత్రి దృష్టికి తీసుకురాగా భూములు కోల్పోతున్న వారికి
ప్రత్యామ్నాయం చూపాలని స్థానిక రెవెన్యూ అధికారులకు సూచించారు. అంతర్గత
రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా
ప్రకటించారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న జగనన్నకు చెబుదాం
ప్రజలు వారి కష్టాలు, ఇతర సమస్యలు చెప్పుకునేందుకు ఓ చక్కని వేదిక
అని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా
ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా
పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ బెల్లాన
చంద్రశేఖర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు
పాల్గొన్నారు.