దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రముఖ బిల్డర్ పరాస్ పోర్వాల్ (57) ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 6 గంటల సమయంలో 23వ అంతస్తులోని తన జిమ్ బాల్కనీ నుంచి దూకి ఆయన బలవన్మరాణానికి పాల్పడ్డాడు. ముంబై చించ్పోక్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని శాంతి కమల్ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన గురువారం జరిగింది.
తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ విచారించవద్దని ఆయన రాసిన ఓ సూసైడ్ నోట్ ను పోలీసులు పరాస్ జిమ్లో స్వాధీనం చేసుకున్నారు. కిందికి పరాస్ పోర్వాల్ దూకిన వెంటనే అటువైపు నుంచి వెళ్తున్న ఒకరు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిగత సమస్యల కారణంగా పోర్వాల్ ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తున్నట్లు అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రీజియన్) జ్ఞానేశ్వర్ చవాన్ తెలిపారు. కాగా, ముంబైలోని పరేల్, చించ్పోక్లి, బైకుల్లా ప్రాంతాల్లోని పాత భవనాల పునరుద్ధరణ ప్రాజెక్టులను పోర్వాల్ చేపట్టారు.
మూలం: ఇండియన్ ఎక్స్ప్రెస్