తమిళనాడులో గత కొన్నేళ్లుగా టీఎన్ పీఎల్ (తమిళనాడు ప్రీమియర్ లీగ్)
జరుగుతోంది. అదే వరుసలో ఏపీలోనూ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పోటీలు
నిర్వహిస్తున్నారు. ఇప్పుడీ లీగ్ లో ఓ టీమ్ ను కొనుగోలు చేసేందుకు టాలీవుడ్
అగ్రహీరో రామ్ చరణ్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
గతేడాది ప్రారంభమైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజయవంతంగా ముగిసింది.
పలువురు వ్యాపారవేత్తలు ఈ లీగ్ లో ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్నారు. కాగా, ఈ
లీగ్ లో వైజాగ్ వారియర్స్ జట్టు కూడా ఆడుతోంది. ఇప్పుడీ వైజాగ్ వారియర్స్ పైనే
రామ్ చరణ్ కన్నేసినట్టు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి చర్చలు
జరిగినట్టు సమాచారం.
వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ సీఈవో భరణి స్పందిస్తూ, రామ్ చరణ్ వంటి సినీ
ప్రముఖుడు ఈ లీగ్ లో భాగస్వామ్యం పొందితే, యువ ఆటగాళ్లకు ఎంతో
ఉత్సాహాన్నిస్తుందని అన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు మీడియా
సమావేశం ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.
రామ్ చరణ్… స్పోర్ట్స్ ఫ్రాంచైజీ కొత్త కాదు. స్వతహాగా గుర్రపుస్వారీని
ఇష్టపడే ఈ గ్లోబల్ స్టార్ గతంలో హైదరాబాద్ పోలో టీమ్ ను కొనుగోలు చేశారు. ఆ
టీమ్ పలు పోటీల్లో విజేతగా నిలిచింది. అంతేకాదు, టర్బో మేఘా ఎయిర్ వేస్ తో
కలిసి ట్రూజెట్ పేరిట విమానయాన సంస్థలోనూ రామ్ చరణ్ కు భాగస్వామ్యం ఉన్నట్టు
అప్పట్లో కథనాలు వచ్చాయి.