సీఎం కేసీఆర్ విద్యా లక్ష్యాన్ని సాధించడమే లక్ష్యం
గురుకుల ప్రిన్సిపల్స్ సంఘం ప్రతినిధుల వెల్లడి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో భేటీ
గురుకుల ప్రిన్సిపల్స్ సంఘం గౌరవ సలహాదారుగా వినోద్ కుమార్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అన్ని గురుకులాల ప్రిన్సిపల్స్ సంఘం ఆదివారం
నూతనంగా ఆవిర్భవించింది. రాష్ట్రంలో ఉన్న 1,062
ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ,జనరల్ గురుకుల పాఠశాలలకు చెందిన ప్రిన్సిపల్స్
కలిసి ఆదివారం హైదరాబాద్ లో నూతనంగా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రిన్సిపల్స్
సంఘం గౌరవ సలహాదారుగా బోయినపల్లి వినోద్ కుమార్ ను ఆ సంఘం ప్రతినిధులు
ఎన్నుకున్నారు. అనంతరం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో గురుకుల
ప్రిన్సిపల్స్ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గురుకుల
ప్రిన్సిపల్స్ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు బంగారు
భవిష్యత్తును కల్పించడమే ఏకైక లక్ష్యంగా తాము కృషి చేస్తామని వెల్లడించారు.
కే.జీ. టు పీ.జీ. వరకు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలన్న రాష్ట్ర
ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు గురుకుల
ప్రిన్సిపల్స్ గా తమ బాధ్యతలను చిత్తశుద్దితో నెరవేరుస్తామని ప్రకటించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 200 పైచిలుకు మాత్రమే గురుకులాలు ఉండగా.. స్వరాష్ట్రం
తెలంగాణ సిద్ధించిన తరువాత ఆ గురుకులాల సంఖ్య 1,062 కు చేరిందని వారు
తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వ గురుకుల
పాఠశాలలు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని, ఈ గురుకులాల్లో పేద, మధ్య
తరగతి విద్యార్థులు విద్యను ఆర్జిస్తున్నారని ప్రిన్సిపల్స్ సంఘం ప్రతినిధులు
పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్ సంఘం నూతన కార్యవర్గ సభ్యులకు
వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్
అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. బోయినపల్లి వినోద్ కుమార్ తో భేటీ అయిన
వారిలో రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్ సంఘం నూతన
అధ్యక్షులు డాక్టర్ ఆర్ . అజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాంబాబు, సంయుక్త
కార్యదర్శి పోరండ్ల చంద్ర మోహన్, కోశాధికారి రాజేశం, మహిళా కార్యదర్శి నీలిమా
దేవి, గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జీ విద్యా సాగర్, వరంగల్ గ్రేటర్ ఇంచార్జీ టీ.
శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.