మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు
గాయపడ్డారు. అమెరికాలోని తుపాకీ సంస్కృతి మరికొందరి ప్రాణాలు బలిగొంది. ఓ
మాల్లో దుండగుడు విచక్షణ రహింతంగా కాల్పులకు పాల్పడిన ఘటనలో చిన్నారులు సహా 8
మంది మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి
విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో దుండగుడు కూడా
హతమయ్యాడని చెప్పారు. టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగర శివారు అలెన్లోని
ప్రీమియర్ మాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో మరోసారి అమెరికా ఉలిక్కి
పడింది. షాపింగ్ కోసం వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేసింది.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.36 గంటల సమయంలో ఓ వ్యక్తి మాల్ బయట కారు
ఆపి కాల్పులు జరుపుతూ లోనికి ప్రవేశించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సంబంధిత వీడియోలు కూడా బయటకొచ్చాయి. కాల్పుల ఘటనపై స్థానికులు అలెన్
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు
జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా మరణించాడు. మృతుల వివరాలను పోలీసులు
వెల్లడించలేదు. మృతుల్లో 5 ఏళ్ల నుంచి 61 ఏళ్ల వయస్కులు ఉన్నారని మాత్రం
వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తుపాకీ
సంస్కృతికి అద్దం పట్టే ఈ తరహా భారీ ఘటనలు అమెరికాలో సర్వ సాధారణంగా
మారిపోయాయి. ఈ ఒక్క ఏడాదిలోనే సగటున వారానికో ఘటన చోటుచేసుకుందని గణాంకాలు
చెబుతున్నాయి. తాజా ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిగ్భ్రాంతి
వ్యక్తంచేశారు. టెక్సాస్ గవర్నర్తో మాట్లాడారు. మరోవైపు ఘటన అనంతరం
మాల్లోని వారందరినీ సురక్షిత ప్రదేశాలకు పోలీసులు తరలించారు.