అమర రాజా కంపెనీ ఆధ్వర్యం లో 9500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న
అతిపెద్ద లిథియం ఫ్యాక్టరీకి శంకుస్థాపన
మహబూబ్ నగర్ ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు
వెల్లడి
మహబూబ్ నగర్ : వలసలు, కన్నీళ్ళకు మారుపేరైన మహబూబ్నగర్ జిల్లాలో 9500 కోట్ల
పెట్టుబడితో అతిపెద్ద లిథియం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అమరరాజ గ్రూపు
ముందుకు రావడం సంతోషమని రాష్ట్ర ఐటీ , మున్సిపల్ పరిపాలన, పరిశ్రమల శాఖ మంత్రి
కే. తారక రామారావు అన్నారు. శనివారం మహబూబ్ నగర్ సమీపంలోని దివిటిపల్లి వద్ద
40 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐటీ టవర్ ను ప్రారంభించారు. అంతేకాక జాతీయ
రహదారి నుండి ఐటీ టవర్ వరకు నిర్మిస్తున్న 100 ఫీట్ల వెడల్పు కలిగిన రహదారిని
పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కే
.తారక రామారావు మాట్లాడుతూ ఒక పరిశ్రమ రావాలంటే ప్రత్యేక దీక్ష, పట్టుదల
అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు
లేకుండా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తున్నామని, ఒక పైస లంచం లేకుండా
అనుమతులు ఇస్తున్నామని అందువల్లనే ఇతర దేశాలతో పోటీపడి మన రాష్ట్రంలో
పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల యజమానులు ముందుకొస్తున్నారని తెలిపారు.
దిటిపల్లి వద్ద ఉన్న ఐటీ కారిడార్ లో అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ అతిపెద్ద
లిథియం ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నదని ,అయితే ఈ విషయం తెలుసుకొని ఇతర
రాష్ట్రాలు కూడా వారి రాష్ట్రాలలో అమర రాజా కంపెనీ ఏర్పాటు చేసేందుకు పోటీపడి
వారిని ఆహ్వానిస్తున్నారని తెలిపారు. భారతదేశంలో 80 కోట్ల మంది యువత ఉన్నారని,
వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని, ప్రభుత్వ ప్రైవేటు
భాగస్వామ్యంతో పరిశ్రమలు ఏర్పాటు చేయడంసులభమని అన్నారు. ఒక పరిశ్రమ వస్తే
ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించడమే కాకుండా, పరోక్షంగా కూడా ఉద్యోగాలు వస్తాయని
అన్నారు. హైదరాబాదులో ఐటి ప్రారంభం చేసినప్పుడు 3,20,000 మందికి పని కల్పిస్తే
ఇప్పుడు 10 లక్షల మంది పనిచేస్తున్నారని ఐటీ పరిశ్రమల వల్ల అనుబంధ రంగాలు కూడా
అభివృద్ధి చెందుతాయని, చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారుతాయని
మంత్రి అన్నారు. అమరరాజా కంపెనీ మొదటి సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలతో లిథియం
ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడుతుందని, దశలవారీగా పెట్టుబడి పెంచే అవకాశాలు
ఉన్నాయని తెలిపారు. అమర రాజా కంపెనీ 37 ఏళ్లలో వారి బ్రాంచ్ లలో పెట్టిన
పెట్టుబడి మొత్తం ఒక మహబూబ్నగర్ లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్లో
పెట్టనున్నారని, ఇది ఎంతో అదృష్టమని అన్నారు .ఈ బ్యాటరీ పరిశ్రమ ద్వారా
ఎలాంటి కాలుష్యం ఉండదని, ఇది లిడ్ ఆసిడ్ పరిశ్రమ కాదని ,లిథియం ఫ్యాక్టరీ అని
మంత్రి స్పష్టం చేశారు. జీరో పొల్యూషన్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ
ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నారని, దీని ద్వారా ఎలాంటి కీడు జరగదని మంత్రి
తెలిపారు. 16 గిగావాట్ల పవర్ తో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా పదివేల
మందికి పైగా ఉద్యోగాలు లభించడమే కాకుండా, పరోక్షంగా కూడా అనేక మందికి ఉపాధి
దోరుకుతుందని తెలిపారు. అమరరాజా వారి సహకారంతోనే ఐటీ టవర్ లోని ఒక ఫ్లోర్
మొత్తంలో నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు
వారు ముందుకు రావడం పట్ల ఆయన అమరరాజ కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు.
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి.
శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దివిటిపల్లి వద్ద ఐటి టవర్ ప్రారంభం జిల్లాలో
మరచిపోలేని రోజని అన్నారు. గతంలో మహబూబ్నగర్ జిల్లా వాసులు పొట్ట చేత
పట్టుకుని వలసలు వెళ్లేవారని, గ్రామాలకు గ్రామాలే వలస వెళ్లిన పరిస్థితులు
ఉన్నాయని, పాలమూరంటే లేబర్ కు కేరాఫ్ గా ఉండేదని , పక్కనే కృష్ణ, తుంగభద్ర
నదులు ఉన్నప్పటికీ తాగునీరు సంగతి దేవుడెరుగు కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు
దొరికేవి కాదని అన్నారు.ఐ టి కోసం ఇతర జిల్లాలలో కేవలం మూడు నాలుగు ఎకరాలు
ఇస్తే, మహబూబ్నగర్ జిల్లాలో 400 ఎకరాలు ఇచ్చామని అన్నారు. జిల్లాలో పరిశ్రమలు
ఏర్పాటు చేసేందుకు ఎవరు వచ్చినా వారిని కడుపులో పెట్టి దాచుకుంటామని మంత్రి
శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మానవీయ కోణంతో అమర్రాజ కంపెనీ అతిపెద్ద లిథియం
ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం పట్ల ఆయన వారిని
అభినందించారు.అలాగే 8 కంపెనీలు ఐ టి కారిడార్ లో వారి యూనిట్లో
నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో అమెరికా కంపెనీ
కూడా ఒకటి ఉందని వెల్లడించారు.
అమర రాజా కంపెనీ కో ఫౌండర్ గల్లా అరుణకుమారి ,అమర్ రాజా కంపెనీ ఫౌండర్ డా.
రామచంద్ర నాయుడు, గల్లా జయదేవ్ తదితరులు మాట్లాడారు.
మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్
చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్,
స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్, జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ ,టిఎస్ఐఐసి
మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి ,జడ్చర్ల శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్
సి. లక్ష్మారెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,కల్వకుర్తి
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ,గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, గోరేటి వెంకన్న, కశిరెడ్డి నారాయణరెడ్డి, పరిగి
శాసనసభ్యులు మహేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ కే. నరసింహ, ఇతర అధికారులు,
ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.