ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్‌ను స్థానిక బ్లడ్ బ్యాంక్ సరఫరా చేసిందని వీడియో ద్వారా ఓ వ్యక్తి ఆరోపించాడు. దీనిపై విచారణ కూడా జరుగుతున్నట్లు తెలిసింది. బ్లడ్ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్ ఉన్నట్లు చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో గల గ్లోబల్ ఆస్పత్రిలో స్కాం జరుగుతోందని ఓ వ్యక్తి వైరల్ అయిన ఆ వీడియోలో తెలిపాడు.
ప్లాస్మా అవసరమైన రోగులకు బత్తాయి జ్యూస్ సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించాడు. ఆ వీడియోలో కనిపించిన బ్లడ్ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్‌ను పోలిన ద్రవం కనిపించింది. ఈ కారణంగానే డెంగ్యూ బారినపడిన రోగి ప్రదీప్ పాండే చనిపోయాడని, ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని ప్రయాగ్‌రాజ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నానని ట్వీట్లో ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా అవుతున్నట్లు వచ్చిన నివేదికలను పరిశీలించేందుకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ రాకేష్ సింగ్ వెల్లడించారు.
గ్లోబల్ హాస్పిటల్ లోని ట్రామా సెంటర్‌ను తప్పనిసరిగా మూసివేయాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆదేశించారు. వైద్యశాలపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మూలం: ఇండియా టుడే