ఒకే రోజు మండుటెండ, జోరు వాన చూశానన్న మంత్రి కేటీఆర్
జంగిల్ సఫారీని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ సమీపంలో ఉన్న కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ లో 26వేల
ఎకరాలలో జంగిల్ సఫారని చేపట్టడం అద్భుతం అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిపాలన,
పరిశ్రమల శాఖ మంత్రి కే .తారక రామారావు అన్నారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని
ఆనుకుని ఇంత భారీ విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండడం స్థానికుల అదృష్టమని ఆయన
పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మంత్రి అప్పన్నపల్లి సమీపంలో ఉన్న
కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును సందర్శించి జంగిల్ సఫారిని ప్రారంభించారు.
అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి
డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, ఎంపి మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్
జి. రవి నాయక్ ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన అడవిలో సఫారీ
నిర్వహించారు. కొద్ది దూరం ప్రయాణించాక వర్షం ప్రారంభమైంది. జోరు వానను కూడా
లెక్కచేయకుండా మంత్రులు దట్టమైన అడవిలో ఉన్న గోల్ బంగ్లా దిశగా ప్రయాణించారు.
అద్దాలు, కిటికీలు లేని జంగిల్ సఫారీ వాహనాలకు వర్షం తాకిడి వల్ల మంత్రులు
పూర్తిగా తడిసిపోయారు. అయినప్పటికీ అడవిలో వారి ప్రయాణం కొనసాగింది. హైవే
నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో నూతనంగా నిర్మించిన గోల్
బంగ్లాను చేరుకుని ప్రారంభించి వాచ్ టవర్ ఎక్కి అక్కడి నుంచి అటవీ అందాలను
తిలకించారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన గోల్ బంగ్లా కూలిపోగా దాని స్థానంలో
పునరుద్ధరించిన గోల్ బంగ్లాను సందర్శించి అక్కడ మ్యాప్ ద్వారా 26వేల అటవీ
విస్తీర్ణాన్ని తిలకించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా
నిర్మిస్తున్న కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లను కూడా ఇక్కడి నుంచి
పరిశీలించారు. భవిష్యత్తులో కెసిఆర్ ఎకో పార్కు పర్యాటకులకు అద్భుతంగా
తయారవుతుందని అన్నారు. ఈ సందర్భంగా కె.తారకరామారావు మాట్లాడుతూ మహబూబ్ నగర్
కు ఉదయం మండుటెండలో వచ్చానని, సాయంత్రం ఎకో పార్కులో కి రాగానే వాతావరణం
చల్లబడటమే కాకుండా సఫారీ చేస్తున్న సమయంలోనే వర్షంతో ఆహ్లాదకరంగా ఉందని,
ప్రశాంత వాతావరణంలో సఫారీ ఎంతో ఉల్లాసాన్ని కలిగించిందని అన్నారు. కేసీఆర్ ఎకో
పార్కులో అడ్వెంచర్ కార్యక్రమాలతో పాటు, పిల్లలు ,పెద్దలు అందరికి ఆహ్లాదం,
వినోదం కలిగించేలా ఏర్పాటు చేయడం పట్ల ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను
అభినందించారు. ఇంత పెద్ద ఎకో పార్కు ఉండడం దేశంలోనే అరుదని ఆయన కితాబునిచ్చారు.
అప్పుడు చిన్న నర్సరీ ఇప్పుడు అతిపెద్ద అర్బన్ పార్క్
ఒకప్పుడు చిన్న నర్సరీగా ఉన్న మయూరి పార్కును ఇప్పుడు దేశంలోని అతిపెద్దదైన
కేసీఆర్ అర్బన్ ఎక్కువ పార్కుగా తీర్చిదిద్దామని మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలిపారు. కేటీఆర్ కు కెసిఆర్ ఎకో పార్కు గురించి వివరిస్తూ… మయూరి
నర్సరీగా ఉన్న కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును 2097 ఎకరాల్లో అభివృద్ధి చేయటం
జరిగిందని తెలిపారు. ఈ పార్కులో నక్షత్రవనాలు, చిల్డ్రన్స్ పార్క్ ,అడ్వెంచర్
కార్యక్రమాలు, రాత్రి టూరిస్టులు బస చేసేందుకు టెంట్లు, బోటింగ్, సైక్లింగ్,
రైన్ యాక్టివిటీస్ వంటివి ఏర్పాటు చేసామన్నారు. జంగిల్ సఫారీ చేసేందుకు కూడా
మంచి అవకాశాలను గుర్తించి 26,000 ఎకరాలలో అటవీ విస్తీర్ణం ఉన్నందున సఫారీని
కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కె సి ఆర్ ఎకో పార్కును మరింత అభివృద్ధి
చేసేందుకు పూర్తి సహకారం అందించాల్సిందిగా ఆయన మంత్రి కేటీఆర్ తో విజ్ఞప్తి
చేశారు.
జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రరెడ్డి, సి.సి.ఎఫ్
క్షితిజ, డీఎఫ్ఓ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
శిల్పారామం ప్రారంభం, నక్లెస్ రోడ్, ఐలాండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన
అంతకుముందు మంత్రి మహబూబ్ నగర్ పట్టణంలో రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మించిన మినీ
శిల్పారామాన్ని ప్రారంభించారు. రూ.48.99 కోట్ల వ్యయంతో చేపట్టిన నెక్లెస్
రోడ్, మరియు ఐలాండ్ సుందరీకరణ పనులను ప్రారంభించారు. కోటి 48 లక్షల రూపాయల
వ్యయంతో అభివృద్ధి చేసిన వన్ టౌన్ జంక్షన్ ను ప్రారంభించారు. మినీ ట్యాంక్
బండ్ మీదుగా వెళ్తున్న వాన నీటి మురికి కాలువను ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ
మంత్రి కేటీఆర్ తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్
సి.లక్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, గువ్వల బాలరాజు,
టూరిజం ఎం డి మనోహర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి యు.వెంకటేశ్వర్లు తదితరులు
ఉన్నారు.