ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో రష్యా సైన్యం నుంచి అవసరమైన ఆయుధాలు
అందకపోవడంతో తమ సైన్యాన్ని విరమించుకుంటామని రష్యాను హెచ్చరించింది.
ఏడాదికిపైగా ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు అడుగడుగునా ఆటంకాలు
ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ సైన్యంతోపాటు ఆయుధాలను
కోల్పోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో యుద్ధంలో కీలకంగా
వ్యవహరిస్తోన్న కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు రష్యా తీరుపై తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేస్తోంది. తమకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని రష్యా సైన్యం
ఇవ్వకపోవడంతో ఎంతో మందిని కోల్పోవాల్సి వస్తోందని ఆరోపించింది. ఈ క్రమంలోనే
కొన్ని వారాలుగా ఉక్రెయిన్ సేనలపై పైచేయి సాధిస్తున్న బక్ముత్ నగరం నుంచి
వెనక్కి వచ్చేస్తామని రష్యాను వాగ్నర్ గ్రూప్ హెచ్చరించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్జెనీ
ప్రిగోజిన్‌కు ఎంతోకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యుద్ధంలో ఎంతో కీలకంగా
వ్యవహరిస్తోన్న ఈ వాగ్నర్ గ్రూపు.. ఉక్రెయిన్‌లోని బక్ముత్ నగరాన్ని మే
9నాటికి పూర్తిగా కైవసం చేసుకుంటామని ఇటీవల ప్రకటించింది. అయితే, ఇందుకు
కావాల్సిన మందుగుండు సామగ్రి మాత్రం రష్యా సైన్యం నుంచి లభించడం లేదని
ప్రిగోజిన్ ఆరోపించారు. అందుకే అక్కడినుంచి తమ బలగాలను వెనక్కి రప్పించి ఈ
ప్రదేశాన్ని రష్యా సైన్యానికి బదిలీ చేస్తామని హెచ్చరించారు. బక్ముత్ నుంచి
తమ బలగాల విరమణకు సంబంధించి వాగ్నర్ గ్రూపు ఓ వీడియో విడుదల చేసింది.
ప్రిగోజిన్ మాట్లాడుతున్నట్లు ఉన్న ఆ వీడియోలో రక్తంతో తడిసి ముద్దైన
(అప్పుడే చనిపోయిన) కొంతమంది వాగ్నర్ సైనికులు ఉన్నారు. సరైన వనరులు, ఆయుధాలు
లేకపోవడంతో బక్ముత్‌లో అనేక వారాలుగా ఉక్రెయిన్ సైన్యంతో పోరాడుతున్న తమ
వాలంటీర్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. ఇందుకు రష్యా రక్షణ
మంత్రి సెర్గి షొయిగు కారణమని ఆరోపించారు. అయితే, వాగ్నర్ గ్రూపు చేస్తోన్న
ఆరోపణలపై రష్యా రక్షణశాఖ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ఇదిలాఉంటే దాదాపు 70,000 జనాభా ఉన్న బక్ముత్ నగరంపై రష్యా గతేడాది నుంచే
దాడులు మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఇక్కడ పోరాటం ఆగలేదు. ఇప్పటికే ఈ ప్రాంతపై
రష్యా కిరాయి సేనలు పట్టు సాధించాయి. ఇరుదేశాలకు ఎంతో కీలకమైన బక్ముత్ నగరం
ఉక్రెయిన్ చేజారితే రష్యా బలగాలు మరింత ముందుకెళ్లే అవకాశాలున్నాయి. ఈ
విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు.
దొనెట్స్క్ దిశగా బక్ముత్ నుంచి ఇతర నగరాలకు చొచ్చుకొనిపోవడానికి రష్యా
సేనలకు సులువవుతుందన్నారు.