టీ-20 వరల్డ్ కప్‌లో క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడుతున్న శ్రీలంక జట్టు సూపర్-12 దశకు అర్హత సాధించింది.
గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో విజయం సాధించిన లంక.. మిగతా సమీకరణలతో సంబంధం లేకుండా గ్రూప్-ఏ నుంచి తదుపరి దశకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బదులుగా నెదర్లాండ్స్ 146 పరుగులకే పరిమితమైంది.
శ్రీలంక బ్యాట్స్మన్లలో ఓపెనర్ కుశాల్ మెండిస్ 44 బంతుల్లో 79 పరుగులతో మెరిశాడు. అసలంక (30 బంతుల్లో 31), రాజపక్స (13 బంతుల్లో 19) అతడికి సహకరించారు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టులో ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (53 బంతుల్లో 71 నాటౌట్) చివరి వరకూ పోరాడాడు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి అతడికి సహకారం లభించలేదు. ఓ దశలో 4 వికెట్ల నష్టానికి 100 పరుగులతో ఉన్న నెదర్లాండ్స్.. పది పరుగుల వ్యవధిలో 4 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. దీంతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించిన శ్రీలంక సూపర్-12 రౌండ్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడుతున్న మిగతా జట్ల కంటే పటిష్టమైన శ్రీలంక..
అనూహ్యంగా తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో 56 పరుగుల తేడాతో ఓడింది. ఆ తర్వాత యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన లంక సూపర్-12 రేసులోకి వచ్చింది. శ్రీలంక చేతిలో ఓడినప్పటికీ నెదర్లాండ్స్ సూపర్-12కు చేరుకునే అవకాశం ఉంది. యూఏఈతో జరిగే మ్యాచ్ లో నమీబియా విజయం సాధిస్తే.. ఇప్పటికే రెండు విజయాలతో పాటు మెరుగైన రన్ రేట్ ఉన్న నెదర్లాండ్స్ తదుపరి రౌండ్ చేరడానికి అర్హత సాధిస్తుంది.