రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని
కర్నూలు : వైద్య సిబ్బంది చిత్త శుద్ధితో పని చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు
అందించాలన్న ముఖ్యమంత్రి ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
మంత్రి విడదల రజని పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని
ధన్వంతరి సమావేశ మందిరంలో హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్స్, ప్రొఫెసర్ల తో మంత్రి
సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలులో
నూతనంగా నిర్మించిన డయాగ్నొస్టిక్ బ్లాక్,పీజీ వసతి గృహాలను ప్రారంభించడం
సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కర్నూలు మెడికల్ కాలేజీ లో
విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నత స్థానాలలో సేవలందిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నో సంస్కరణలు
తీసుకువస్తున్నారన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా 49 వేల వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టడం
జరిగిందన్నారు. స్ట్రక్చర్డ్ స్టా ఫింగ్ ప్యాటర్న్ తో వేకెన్సీలను భర్తీ
చేస్తున్నామన్నారు. ఎక్కడా వైద్య సిబ్బంది కొరత లేకుండా, సేవలకు అంతరాయం
లేకుండా చూడగలుగుతున్నామన్నారు..రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు గానూ ఐదు
మెడికల్ కాలేజీలలో ఈ ఏడాది అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభం కానుందన్నారు.. ఈ
కళాశాలల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రానున్నాయని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో చేపడుతున్న సంస్కరణలను చూసి బయటి రాష్ట్రాలు
కూడా ఆశ్చర్యపోతున్నాయని మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించిన డయాగ్నొస్టిక్
కేంద్రంలో ఎమ్మారై, సిటీ స్కాన్ కు సంబంధించి మూడు నెలల్లో ఏర్పాటు చేసేందుకు
కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఆసుపత్రి
పర్యవేక్షకులు చర్యలు తీసుకొని పరిష్కరించేలా చూడాలన్నారు. ఆసుపత్రిలో
పరిశుభ్రతకు ముఖ్య ప్రాధాన్యత ఇచ్చేలా సంబంధిత ఏజెన్సీలను ఆదేశించాలన్నారు.
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు మందులు కూడా
ఉచితంగా అందిస్తున్నామని, మందులు అవసరాన్ని బట్టి సెంట్రల్ డ్రగ్స్ స్టోర్
నుండి సమకూర్చుకోవాలన్నారు. అత్యవసర మందులకు సంబంధించి మెయిల్, వాట్సప్
చెయ్యకుండా ఒక్క ఫోన్ కాల్ చేయడంతో అవసరమైన మందులు సమకూర్చేలా చర్యలు
తీసుకుంటామన్నారు. జూనియర్ డాక్టర్స్ కు సంబంధించిన రవాణా, వసతి సదుపాయం అంశం
కూడా త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. పేషెంట్లను తరలించేందుకు అవసరమైన బగ్గి
వాహనాలను కూడా త్వరలోనే ప్రవేశపెడతామన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు
అవసరమైన సామాగ్రిని సమకూర్చుకునేందుకు హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్స్,
ప్రొఫెసర్స్ అందించిన సూచనలు, ప్రజా ప్రతినిధులు తెలియజేసిన సమస్యల
సాధ్యాసాధ్యాలను పరిశీలించి వాటిని పూర్తిచేసేలా కృషి చేస్తామన్నారు. అవసరమైన
పరికరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు..కొవిడ్ సమయంలో వైద్యులు
ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారని
డాక్టర్లను మంత్రి అభినందించారు.
కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టరు సంజీవ్ కుమార్ మాట్లాడుతూ జూనియర్
డాక్టర్లకు సంబంధించి మూడు నెలల పాటు గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందించాలని
ప్రభుత్వ ఆదేశాలు ఆదేశించిందన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు సరైన రవాణా
మరియు వసతి సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.
నాకు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాల కనుక వివిధ విభాగాల వైద్యాధిపతులు కోరిన
కొన్ని వాటిని ఎంపీ ల్యాండ్స్ ద్వారా మంజూరు చేస్తామని వాటిలో మొదటగా ఆసుపత్రి
ఆవరణంలో పేషంట్లను వివిధ వార్డులకు తరలించేందుకు రూ 24 లక్షలతో నాలుగు
ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు, వైద్య కళాశాల కు రూ.40 లక్షలతో 34 మంది
సామర్థ్యంతో కూడిన ఏసీ బస్సు, రూ.20 లక్షలతో ఆసుపత్రికి అవసరమైన ఏసీ
అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తామని, ఆ మేరకు కలెక్టర్ త్వరితగతిన చర్యలు
తీసుకోవాలని కోరారు. ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్కిల్ ల్యాబ్
ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కళాశాలకు 16 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి
ని కోరగా రాష్ట్రవ్యాప్తంగా 187 పోస్ట్లు మంజూరు చేసినందుకు ఎంపి ధన్యవాదాలు
తెలిపారు. అదేవిధంగా ట్రామా కేసులు ఎక్కువగా వస్తాయని, అందుకు అవసరమైన
అప్గ్రేడెడ్ ట్రామా కేంద్రాన్ని మంజూరుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని,
ఫైల్ కదిలేలా చూడాలన్నారు. ఆసుపత్రి ఆవరణంలో పరిశుభ్రం, సెక్యూరిటీ కోసం
ప్రతి నెల కోటి 7 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని, అయినప్పటికీ ఏమాత్రం
పరిశుభ్రత లేదని వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలని మంత్రికి విజ్ఞప్తి
చేశారు. పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో
డాక్టర్లు చేసిన సేవలు మరువలేమని డాక్టర్లను కొనియాడారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ
కింద పేషెంట్లకు తప్పనిసరిగా మెడికల్ రియంబర్స్మెంట్ అందించేలా చూడాలన్నారు.
కల్లూరు పరిధిలో పిహెచ్సి ని డెవలప్ చేసి అవసరమైన సదుపాయాలు కల్పించాలని
మంత్రి కోరారు.