చెన్నై : నిజాయతీగా వ్యవహరిస్తేనే అందరి ఆదరాభిమానాలు పొందవచ్చని పద్మశ్రీ
అవార్డు గ్రహీత, కిమ్స్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పి.రఘురామ్
పేర్కొన్నారు. ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ‘బిజినెస్ ఎక్స్‌లెన్స్
అవార్డులు 2023’ పేరిట వివిధ రంగాల ద్వారా సమాజానికి ఉత్తమ సేవలందించిన వారికి
అవార్డుల ప్రదానం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. యువతకు వ్యాపార
రంగంలో శిక్షణ ఇస్తున్నందుకు స్వర్ణభారత్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ దీపా
వెంకట్, వైద్య రంగంలో ఉచిత సేవలకు విజయా మెడికల్, ఎడ్యుకేషనల్ ట్రస్టు
మేనేజింగ్ ట్రస్టీ భారతీరెడ్డిలకు బహుమతులను అందజేశారు. దీపా వెంకట్
మాట్లాడుతూ యువతను అభివృద్ధి మార్గంలో నడిపించాలనే ధ్యేయంతో ముందుకు
సాగుతున్నామని చెప్పారు. తమ తండ్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి
ప్రోత్సాహంతో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. భారతీరెడ్డి మాట్లాడుతూ
నగరంలో విజయా ఆసుపత్రి పేరుతో తమ కుటుంబం 50 ఏళ్లకుపైగా నాణ్యమైన వైద్య
సేవలందిస్తున్నదని గుర్తుచేశారు. ఇందిరాదత్ స్వాగతోపన్యాసం చేశారు.
కార్యక్రమంలో భాగంగా వియత్నాంనుంచి చెన్నైలో గౌరవ దౌత్యాధికారిగా నియమితులైన
కవితా దత్‌ను జ్ఞాపికతో సత్కరించారు.