ప్రజల సొమ్ము వృథా అంటూ ధ్వజమెత్తుతున్న జనం
వేడుకతో భారీ ఆదాయం వస్తుందంటున్న మరోవర్గం
బ్రిటన్ : బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవంపై బ్రిటన్‌లో
భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం, రెండంకెల ద్రవ్యోల్బణం,
ఉక్రెయిన్ యుద్ధ ఫలితాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ. ఈ ఆర్భాటాలు, కోట్ల
పౌండ్ల వృథా వ్యయం అవసరమా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత మంది ఏకంగా
ఈ కాలంలో రాజరికం అవసరమా అంటూ నిలదీస్తున్నారు. ఈ ఖర్చును రాజు ఛార్లెసే
భరించాలని, ప్రజలు కట్టిన పన్నుల నుంచి తీసుకోవద్దనేది మరికొందరి డిమాండ్.
పట్టాభిషేక వేడుక ఎంతో ఆదాయాన్నిస్తుందంటూ ఇంకొందరు సమర్థిస్తున్నారు. ఇలా
భిన్న గళాలతో బ్రిటన్ మార్మోగుతోంది. ఎలిజబెత్-2 రాణి మరణంతో సెప్టెంబరులోనే
ఛార్లెస్-3 ఇంగ్లాండ్ రాజుగా అధికారికంగా నియమితులయ్యారు. వచ్చే శనివారం
జరగబోతున్నది పట్టాభిషేక మహోత్సవం. అంటే సంప్రదాయాలు, లాంఛనాల మధ్య
ఛార్లెస్-3కి రాజ కిరీట ధారణ చేస్తారు. 70ఏళ్ల కిందట 1953లో చివరిసారి
ఎలిజబెత్-2 పట్టాభిషేకం తర్వాత ఇప్పటిదాకా అలాంటి కార్యక్రమం జరగలేదు. అంటే ఈ
తరం రాజ కుటుంబ కిరీట ధారణను చూడలేదు. చాలా మందిలో ఆ కార్యక్రమం, సంప్రదాయాల
పట్ల ఆసక్తి ఉన్నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎక్కువ మందిలో విముఖత
వ్యక్తం అవుతుండటం గమనార్హం. దీనిపై నిర్వహించిన వివిధ సర్వేల్లో
50శాతానికిపైగా ప్రజలు అట్టహాస పట్టాభిషేకంపై పెదవి విరిచారు. ఇదంతా
ప్రజాధనాన్ని వృథా చేయడమేనని అభిప్రాయపడుతున్నారు.
ఆనాడు సామ్రాజ్యం… నేడు? : 1953లో ఎలిజబెత్-2 పట్టాభిషేకం జరిగిన సమయానికి
బ్రిటన్ రాజకీయంగా బలమైన దేశం. ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుండేది.
ఐరోపాలోనైతే బ్రిటన్‌దే పెద్దన్న పాత్ర. వలస రాజ్యాలు పోయినా కామన్వెల్త్
పేరిట బ్రిటన్ రాజరికానికి గౌరవం ఉండేది. అన్నింటికి మించి చర్చ్ ఆఫ్
ఇంగ్లాండ్‌ను, మతాన్ని మెజారిటీ ప్రజలు అనుసరించేవారు. కానీ పరిస్థితులు
మారిపోయాయి. అలనాటి రాజకీయ పెత్తనంగానీ, కామన్వెల్త్ గౌరవంగానీ ఇప్పుడు లేవు.
బ్రెగ్జిట్ తర్వాత ఐరోపాలోనూ బ్రిటన్ ఏకాకిగా ఇబ్బంది పడుతోంది. పైగా ఆర్థిక
సంక్షోభాలతో ఒకనాటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అతలాకుతలం అవుతోంది.
చాలామంది ఆర్థికవేత్తల దృష్టిలో బ్రిటన్ ఇప్పుడో పేద దేశం. అంతేగాకుండా…
దేశంలో సుమారు 46శాతం మందే చర్చిని, మతాన్ని అనుసరిస్తున్నట్లు 2021 జనగణన
లెక్కలు తేల్చాయి. అంటే బ్రిటన్‌లో మెజారిటీ ప్రజలు మతానికి, చర్చికి
దూరమయ్యారు. వీటన్నింటికి తోడు తాజా ఆర్థిక పరిస్థితులతో దేశంలో జీవన వ్యయం
భారీగా పెరిగిపోయింది. సామాన్యుల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ఆహార లభ్యత
కష్టమైపోతోంది. ఆహార బ్యాంకులపై ఆధారపడుతున్న వారి సంఖ్య నానాటికీ
పెరుగుతోంది. ఇప్పటికే అధికారికంగా రాజుగా బాధ్యతలు చేపట్టిన ఛార్లెస్
పట్టాభిషేకం కోసం 10 కోట్ల పౌండ్లను (రూ. 1,020 కోట్లు) ఖర్చు చేయడాన్ని
చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.
అసలు పట్టాభిషేకం ఎందుకనే ప్రశ్న చాలామందిలో ఉత్పన్నమవుతోంది. కారణం ఐరోపాలోని
అనేక దేశాల్లో రాజరికాలున్నా ఇలా కిరీట ధారణ, పట్టాభిషేకం కార్యక్రమాలు లేవు.
బెల్జియం, డెన్మార్క్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్,
స్వీడన్.. ఇలా అన్నింటా రాజరికాలున్నాయి. కానీ ఎక్కడా ఇలా పట్టాభిషేకం లేదు.
అధికారిక ప్రకటనతోనే రాజు/రాణి పదవి చేపడతారు. అయితే… బ్రిటన్‌కు
గౌరవప్రదమైన సంప్రదాయాన్ని అంతే గౌరవంగా నిర్వహించాలని వాదించేవారూ లేకపోలేదు.
‘ఈ తరంలో ఇప్పటివరకూ చూడని అరుదైన వేడుక ఇది. బ్రిటిష్ ప్రజలందరికీ ఇది
గర్వకారణం. వీటిపై ఖర్చు చేసేదేమీ కాదు. పట్టాభిషేకానికి ప్రభుత్వమే ఖర్చు
చేయడమనేది సంప్రదాయం. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత హంగామా
లేకుండా చేస్తాం’ అని బ్రిటన్ ఉప ప్రధాని ఒలివర్ డౌడెన్ వ్యాఖ్యానించారు.
ఛార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవానికి దేశ విదేశాల ప్రముఖులు, అతిథులతో పాటు ఓ
బండకూ ప్రత్యేక స్థానం లభించబోతోంది. బ్రిటన్ చక్రవర్తి, రాణి పట్టాభిషేకంలో
సంప్రదాయాలదే పెద్దపీట. ఇందులో వాడే వస్తువులు, పాటించే పద్ధతులు అన్నింటికీ
పెద్ద చరిత్రే ఉంటుంది. అలాంటిదే ఈసారి పట్టాభిషేకంలో కనిపించబోతున్న ఓ
స్కాట్లాండ్ బండ. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ బండను ఇటీవలే
స్కాట్లాండ్లోని ఎడిన్‌బరో రాజభవనం నుంచి లండన్‌కు అత్యంత గౌరవ మర్యాదలతో,
రాజ లాంఛనాలతో తీసుకొచ్చారు. 150 కిలోల బరువుండే ఈ ఎర్ర రంగు బల్లపరుపు బండను
స్కోన్ బండ (స్కాట్లాండ్లోని పట్టణం పేరు స్కోన్)గా పిలుస్తారు. దీన్ని
ఎంతో పవిత్రమైనదిగా, రాజరికపు, జాతీయ ప్రతీకగా, ‘విధి పీఠం’ (స్టోన్ ఆఫ్
డెస్టినీ) భావిస్తుంటారు. తొమ్మిదో శతాబ్ది ఆరంభంలో స్కాటిష్ రాజులు దీనిపై
కూర్చుని పట్టాభిషేకం చేసుకునేవారు. కిరీటాలేమీ ఉండేవి కావు. ఈ రాతి
సింహాసనంపై కూర్చోవడాన్నే రాజ్యానికి బలమైన పునాదిగా భావించేవారు.