టీ-20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో కచ్చితంగా గెలవాల్సిన అమీతుమీ మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచింది. దీంతో టీ-20 వరల్డ్‌కప్ ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది. తొలి రౌండ్ గ్రూప్-బిలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో విండీస్ 31 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. తొలుత వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది.
జాన్సన్ చార్లెస్ (45), పావెల్ (28), అఖిల్ హుస్సేన్ (23 నాటౌట్) ఆదుకొన్నారు. సికందర్ రజా (3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అల్జారి జోసెఫ్ (4/16) నాలుగు వికెట్లతో చెలరేగడంతో.. జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. లూక్ జాంగ్వే (29), వెస్లీ (27) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.
హోల్డర్ (3/12) మూడు వికెట్లు దక్కించుకొన్నాడు. స్కాట్లాండ్ చేతిలో ఓటమి తర్వాత.. సూపర్-12కు చేరాలంటే కరీబియన్లకు ఈ మ్యాచ్ చావోరేవోలా మారింది.
అంతేకాకుండా భారీగా రన్‌రేట్‌కు పెంచుకోవాల్సిన అవసరం ఉండడంతో విండీస్ కెప్టెన్ పూరన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ కైల్ మేయర్స్ (13)ను చిక్బవా నాలుగో ఓవర్లో పెవిలియన్‌కు చేర్చినా.. మరో ఓపెనర్ చార్లెస్, లూయిస్ (15) రెండో వికెట్‌కు 49 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. విండీస్ నిలకడగా ఆడుతున్న సమయంలో లూయి్సను సికందర్ అవుట్ చేసి దెబ్బకొట్టాడు. అయితే, పూరన్ (7), చార్లెస్, బ్రూక్స్ (0) ఏడు పరుగుల తేడాతో వెనుదిరగడంతో.. విండీస్ 97/5తో ఒక్కసారిగా కష్టాల్లో పడింది. కానీ, పావెల్, హుస్సేన్ ఏడో వికెట్‌కు 49 పరుగులు జోడించడంతో.. జట్టు స్కోరు 150 పరుగుల మార్క్ దాటింది. లక్ష్యం కోసం బరిలోకి దిగిన జింబాబ్వే.. పవర్‌ప్లే ముగిసేసరికి 55 పరుగులు చేసినా క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకొంది.
టాపార్డర్ బ్యాటర్లు చకబ్వా (13), టోనీ మున్యోగా (2)తోపాటు ధాటిగా ఆడుతున్న లూక్, గరావా (2)ను జోసెఫ్ పెవిలియన్ చేర్చాడు. హోల్డర్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే ఏ దశలోనూ మ్యాచ్‌లోకి రాలేదు.