ఆర్థిక, ప్రణాళికా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు, విద్యా
శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, విద్యా శాఖ కమిషనర్ దేవసేన
హైదరాబాద్ : రాష్ట్ర అర్థ గణాంక, ప్రణాళికా అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంగళవారం జరిగిన ఉన్నత
స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్
బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖల ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి కె రామకృష్ణారావు, రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి
కరుణ, రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ దేవసేన, అర్థగణాంక శాఖ డైరెక్టర్ దయానంద్,
టి.ఎస్.డి.పి.ఎస్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామకృష్ణ, కాకతీయ గవర్నన్స్ ఫెలోషిప్,
సిజిస్, కే పి ఐ సర్వే ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యా, వైద్యం,
పోషకాహారం, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అమలు జరుగుతున్న తీరు తెన్నులను సూక్ష్మ స్థాయిలో
పరిశీలించి పక్కాగా నివేదికలు రూపొందించాలని, అందుకు ప్రతిష్ఠాత్మక సంస్థల
సేవలను తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్వే నివేదికల
ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని శాఖలకు విస్తరించే అంశాన్ని పరిశీలించాలని
సమావేశంలో నిర్ణయించారు. వైద్య – ఆరోగ్యం, విద్యా శాఖ, పోషకాహారం, హౌస్ హోల్డ్
సర్వే, పాఠశాలల్లో విద్యా బోధన ఔట్ కం అంశాలపై తొలి దఫా సర్వే
నిర్వహించనున్నారు. ఈ మేరకు విధి విధానాలను సంబంధిత బాధ్యులకు వివరించారు.