ఏలూరు : రైతులు అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఈ సమయంలో ముఖ్యమంత్రి
తాడేపల్లి బంగ్లా వదిలి బయటకు రావాలని, హెలికాప్టర్లో తిరగటం కాకుండా
క్షేత్రస్థాయిలో సీఎం జగన్, వ్యవసాయ మంత్రి పర్యటించి రైతులకు జరిగిన
నష్టాన్ని పరిశీలించి న్యాయం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు
డిమాండ్ చేశారు. ఏలూరు, దెందులూరు మండలాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన
ప్రాంతాల్లో ఆయన మంగళవారం సాయంత్రం పర్యటించారు. ఏలూరు మండలం పాలగూడెం,
దెందులూరు మండలం కొవ్వలి గ్రామాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల వద్దకు
వేళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ధాన్యం ఎగుమతి
చేసేందుకు రైతులకు చినిగిపోయిన సంచులను ఇస్తోందని, ధాన్యం తడిచిందని,
మొలకెత్తిందని సాకు చూపి తక్కువ రేటుకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని
సోము వీర్రాజు వద్ద రైతులు వాపోయారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో
మాట్లాడుతూ ధాన్యం రవాణా చార్జీలు ప్రభుత్వమే భరించాలని, రైతులకు కొత్త
సంచులను సరఫరా చేయాలని, తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం రైతులు
నష్టపోకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలు చిన్నవి అవటంవల్ల
సమర్థవంతంగా పనిచేయడానికి అధికారులకు అవకాశం ఉన్నప్పటికీ ఆ పరిస్థితి
రాష్ట్రంలో లేదని అన్నారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా వాతావరణ హెచ్చరికలు
రైతులకు ముందుగానే జారీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదిశగా చర్యలు
తీసుకోవడం లేదని అన్నారు. వరి, మొక్కజొన్న, మిర్చి ,టమోటా, ఉల్లి రైతులు
ప్రభుత్వ అనాలోచిత వైఖరి వల్ల తీవ్రంగా నష్టపోయారని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు
న్యాయం జరిగే వరకూ భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని
వారికి అండగా నిలిచిందని సోము వీర్రాజు రైతులకు హామీ ఇచ్చారు. కొవ్వలి
గ్రామంలో ఒక రైతు సోమువీర్రాజు చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతం
అయ్యారు.తాముకష్టాల్లో ఉంటే పలకరించడానికి వచ్చింది మీరేనంటూ కన్నీటి పర్యంతం
అయ్యారు దీంతో ఒక్క సారి గా సోము వీర్రాజు చలించి పోయారు. రైతును వోదార్చి
అండగా బిజెపి ఉంటుందన్నారు. సోము వీర్రాజు వెంట బిజెపి రాష్ట్ర కార్యవర్గ
సభ్యులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కీర్తి
రాంప్రసాద్, జిల్లా జనరల్ సెక్రెటరీ కట్నేని కృష్ణ ప్రసాద్, సత్యనారాయణ తదితర
బిజెపి నాయకులు పాల్గొన్నారు.