రాజమహేంద్రవరం : సంఘసంస్కర్త, సాహితీవేత్త కందుకూరి వీరేశలింగం స్థాపించిన
విద్యాసంస్థలన్నిటిని కలిపి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా విశ్వవిద్యాలయం
ఏర్పాటుచేయాలని హితకారిణి సమాజం చైర్మన్ కాశి బాల ముని కుమారి అధ్యక్షతన
జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. మంగళవారం హితకారిణి సమాజం చైర్మన్,
అసిస్టెంట్ కమీషనర్ మరియు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లతో
ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముని
కుమారి మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం మరియు ఆయన భార్య కందుకూరి రాజ్యలక్ష్మి
వారి యావదాస్తిని సమాజ హితం కోసం, మహిళా అభ్యున్నతి కోసం త్యాగం చేశారన్నారు.
హితకారిణి సమాజం ద్వారా విద్యాసంస్థలను స్థాపించి స్త్రీవిద్య కోసం
ప్రత్యేకంగా కృషి చేశారని తెలిపారు. కాలనుగుణంగా హితకారిణి సమాజం పాలకమండలి
ఆయన స్థాపించిన విద్యా సంస్థలను నిర్వహించలేని పక్షంలో వాటన్నింటినీ
ప్రభుత్వంలో విలీనం చేసి అభివృద్ధి చేయాలని ముందు చూపుతో ఆయన స్వయంగా వీలునామా
రాయించారని అన్నారు. ఈ క్రమంలోనే ఎస్.కె.వి.టి డిగ్రీ కాలేజీ, శ్రీమతి
కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. ప్రస్తుతం హితకారిణి సమాజం పరిధిలో
మిగిలిఉన్న కందుకూరి రాజ్యలక్ష్మి ఎంబీఏ, డియిడి మహిళా కళాశాలలను కూడా
కలుపుకుని కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా విశ్వవిద్యాలయంగా మార్చాలని తీర్మానం
చేసి ముఖ్యమంత్రి కి పంపనట్లు తెలియజేశారు. ఈ విషయమై ఇప్పటికే రాజమహేంద్రవరం
పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ తో చర్చించామని త్వరలోనే దీనికి
సంబంధించిన కసరత్తు ప్రారంభిస్తామని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో తిరుపతిలో
మాత్రమే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉందని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు
మహిళా విశ్వవిద్యాలయ అవసరాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకునివెళ్లి
కందుకూరి వీరేశలింగం పేరు ప్రతిష్టలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి
చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో హితకారిణి సమాజం బోర్డ్ డైరెక్టర్లు
దేవులపల్లి సరితారాణి, గుడాల ఆదిలక్ష్మి, దూనబోయిన అరుణ కుమారి, ఉల్లూరి రాజు,
ముద్దు సతీష్, దొమ్మలపాటి సత్యనారాయణ, కాలచర్ల శివాజీ, మరియు హితకారిణి సమాజం
సిబ్బంది పాల్గొన్నారు.