తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానం
హాజరైన రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ ఇతర ప్రముఖులు
గుంటూరు : సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా విలువైనదని, వీరు సంఘటితంగా
ఉండడం ఆనందదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు
జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో
మంగళవారం ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల వేడుక నిర్వహించారు.
కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీబీఐ జాయింట్
డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు,
కేర్ హోమియోకేర్ అధినేత డాక్టర్ ఏఎం రెడ్డి, స్పందన ఈదా ఇంటర్నేషనల్
ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్ రెడ్డి, డాక్టర్ రామినేని ఫౌండేషన్
కన్వీనర్ పాతూరి నాగభూషణం, యూబ్లడ్ ఫౌండర్, చైర్మన్ యలమంచిలి
జగదీష్ బాబు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతి
ప్రజ్వలన గావించారు. అనంతరం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక
అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు.
తెలుగు జర్నలిస్టులు ఐక్యతను చాటుతూ.. వారి సంక్షేమం కోసం పాటుపడుతూ భరోసా
కల్పించడమే ద్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. సంఘం యొక్క విధివిధానాలను
వివరించారు. ఈ సందర్భంగా తెలుగు జర్నలిస్టుల సంఘం కర్తవ్యాన్ని వివరిస్తూ
చేసిన పాటను అతిథులు ఆవిష్కరించారు. సంఘం పాట, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య
నాయుడు, జేడీ లక్ష్మీనారాయణ బయోపిక్ లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంచలనాల కోసం
వార్తలు రాయకూడదని, నిజాలను ప్రజలకు చేరవేయాలని జర్నలిస్టులకు సూచించారు.
తెలుగు జర్నలిస్టులు అందరూ ఏకమవడం, వారిని ప్రోత్సహించేందుకు పురస్కారాలు
అందించడం అభినందనీయం అన్నారు. జర్నలిస్టుల కోసం పాటుబడే తెలుగు జర్నలిస్టుల
సంఘం అధ్యక్షులు, నిర్వాహుకులను ఆయన అభినందించారు. తెలుగు ప్రాంతం పైన, బాష
పైన, వ్యక్తుల పట్ల అభిమానం ఉండాలన్నారు. బాష పైన పట్టు తప్పనిసరి అన్నారు.
ప్రస్తుత రోజుల్లో న్యూస్ ఏదో గుర్తించడం కష్టంగా మారిందన్నారు. ప్రస్తుత
రోజుల్లో రాజకీయ నాయకులు ఎప్పుడూ ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో కూడా తెలియడం
లేదని, ప్రతి ఒక్కరికి రంగుల రాజకీయం కావలసి వస్తుందని చెప్పారు. మంచి
విషయాలను జర్నలిస్టులు కూడా వదిలేస్తున్నారని, అదే ఏదైనా బూతులు మాట్లాడే
వారికి ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. బూతులు మాట్లాడే వారికి
పోలింగ్ బూత్ లోనే బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
న్యూస్ ను వ్యూస్ కలపొద్దుః సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వార్తల సేకరణలో మూడు రకాల పద్ధతులు
అవలంబించాలని చెప్పారు. వార్త జరిగిందో ? లేదో ? తెలుసుకుకోవాలని, వార్తలో
నిజాన్ని గుర్తించాలని, అది ప్రజలకు ఉపయోగమా ? లేదా ? చూడాలని చెప్పారు.
ఇప్పటి రోజుల్లో సోషల్ మీడియా మెయిన్ మీడియాను శాసిస్తున్నట్లు
కనిపిస్తుందని, ఈ ధోరణి మారాలని ఆయన ఆకాంక్షించారు. జర్నలిస్టు ఉద్యోగం అనేది
బాధ్యతతో కూడుకున్నదని, సోమాలియా, సిరియా దేశాలలో కేవలం ఒకే ఒక ఫోటో
స్థితిగతుల్లో మార్చేసిందని, ఇది కేవలం జర్నలిస్టులకు మాత్రమే సాధ్యమని ఆయన
పేర్కొన్నారు. నేటి సమాజంలో జర్నలిజం దృక్కోణం మారిందని, ఈ పరిస్థితి
సమాజానికి ఆందోళనకరమని ఆయన అన్నారు. ప్రజలకు ఉపయోగపడేదిగా జర్నలిజం ఉండాలని
ఆయన సూచించారు.
నిబద్ధత, క్రమశిక్షణ అవసరం
సమాజానికి మూల స్తంభం జర్నలిస్టులని, అలాంటి జర్నలిస్టులు క్రమశిక్షణతో
వ్యవహరించాలని రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం సూచించారు, యూ
బ్లడ్ చైర్మన్ యలమంచిలి జగదీశ్ బాబు మాట్లాడుతూ రక్తదానం మహాదానంతో
సమానమని చెప్పారు. యూబ్లడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక మనిషి ప్రాణాన్ని
నిలబెట్టినట్టేనని అన్నారు. డాక్టర్ ఏఎం రెడ్డి మాట్లాడుతూ రేయింబవళ్లు
విధుల్లో ఉండే జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. తమ
హాస్పిటల్ ద్వారా జర్నలిస్టులకు 50 శాతం ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని
చెప్పారు. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ శామ్యూల్ రెడ్డి
మాట్లాడుతూ నేటి సమాజంలో జర్నలిస్టులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. దీన్ని
బట్టి జర్నలిస్టుల విలువ ఏంటో అందరికీ తెలుసన్నారు. యువత ను సన్మార్గంలో
నిలిపే, ప్రేరణాత్మక కథనాలు రాయాలని జర్నలిస్టులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నిమ్మరాజు చలపతిరావు, టి డి ప్రసాద్
తదితరులు పాల్గొన్నారు.
28 మందికి ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు
ఈ సందర్భంగా 23 విభాగాలలో ఎంపికైన 28 మంది ఉత్తమ జర్నలిస్టులకు విశిష్ట
అతిధులు, ప్రత్యేక అతిథులతో కలిసి ముఖ్య అతిధి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
నాయుడు చేతుల మీదుగా అవార్డులు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారం
కూడా అందించారు.